మహబూబ్నగర్ జిల్లాలోని 122 సర్పంచ్ స్థానాలు, 914 వార్డు స్థానాలకు మూడో విడత పోలింగ్

 మహబూబ్నగర్ జిల్లాలోని 122 సర్పంచ్ స్థానాలు, 914 వార్డు స్థానాలకు మూడో విడత పోలింగ్
  • ‘తుది’ విడతకు సర్వం సిద్ధం
  • నేడు మూడో విడత సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు 
  • ఏర్పాట్లు పూర్తి చేసిన ఆఫీసర్లు 
  • బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్స్ లను పోలింగ్ స్టేషన్లకు 
  • తరలించిన ఎన్నికల సిబ్బంది 
  • పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు 

మహబూబ్ నగర్/ నాగర్​కర్నూల్/ గద్వాల/ వనపర్తి, వెలుగు : సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాలకు జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు, నాగర్ కర్నూల్, గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో ఇప్పటికే మొదటి, రెండవ దఫా ఎన్నికలు పూర్తి కాగా, బుధవారం చివరి విడత ఎన్నికలు జరగనున్నాయి. 

ఈ క్రమంలో ఆఫీసర్లు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు మంగళవారం ఎన్నికలు జరగనున్న మహబూబ్ నగర్ జిల్లాలోని అడ్డాకుల, బాలానగర్, జడ్చర్ల, భూత్పూర్, మూసాపేట మండలాల్లోని గ్రామ పంచాయతీలకు ఎన్నికల సామగ్రిని తరలించారు. ఈ సందర్భంగా మహబూబ్​నగర్, నారాయణపేట, నాగర్​కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఆయా జిల్లాల కలెక్టర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల సిబ్బందికి పలు సలహాలు, సూచనలు చేశారు.
 
మూడో విడత ఎన్నికల్లో భాగంగా మహబూబ్​నగర్ జిల్లాలోని అడ్డాకుల, బాలానగర్, జడ్చర్ల, మూసాపేట, భూత్పూర్ మండలాల్లోని 122 సర్పంచ్ స్థానాలు, 914 వార్డు స్థానాలకు పోలింగ్ జరుగనుంది. 

నారాయణపేట జిల్లాలోని మక్తల్, కృష్ణ, మాగనూరు, నర్వ, ఊట్కూరు మండలాల్లోని 100 సర్పంచ్​స్థానాలు, 775 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. 

నాగర్​ కర్నూల్ జిల్లాలో అచ్చపేట, అబ్రాబాద్, లింగాల, చారకొండ, బల్మూర్, పదర, ఉప్పునుంతల ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం134 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలు,1,064 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. 

వనపర్తి జిల్లాలోని చిన్నంబావి, పాన్​ గల్, పెబ్బేరు, వీపనగండ్ల, శ్రీరంగాపూరు మండలాల్లో 81 సర్పంచ్ , 104 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 
గద్వాల జిల్లాలోని ఎర్రవల్లి, ఇటిక్యాల, మానవపాడు, ఉండవల్లి, ఆలంపూర్ మండలాల్లోని 68 సర్పంచ్ స్థానాలు, 638 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 

మూడో విడతలో పోటాపోటీ.. 

మొదటి, రెండవ విడత జరిగిన సర్పంచ్, వార్డ్ మెంబర్ ఎన్నికల్లో ఓటర్లు అధికార పార్టీ మద్దతుతో పోటీ చేసిన క్యాండిడేట్లకే ఓట్లు వేసి ఆశీర్వదించారు. ఆయా జిల్లాల్లో దాదాపు 60 శాతం మంది అధికార పార్టీ మద్దతుతో పోటీ చేసిన వారిని సర్పంచులుగా ఎన్నుకున్నారు. అయితే చివరి దశ ఎన్నికలు జరిగే మండలాల్లో ప్రధాన పార్టీల మద్దతుదారుల మధ్య పోటాపోటీ నెలకొంది. కచ్చితంగా గెలవాలని ఉద్దేశంతో ప్రలోభాలకు తెర లేపారు. ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు ఇస్తున్నారు. క్యాండిడేట్ల మద్దతుదారులు ఇంటింటికీ తిరుగుతూ మద్యం బాటిళ్లను పంపిణీ చేశారు.