ఖమ్మం/భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తుదిపోరుకు రంగం సిద్ధమైంది. మూడు విడతల్లో జరుగుతున్న ఎలక్షన్లకు ఇవాళ్టితో తెర పడనుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 14 మండలాల్లో ఉన్న 313 గ్రామాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాత్రి వరకు అన్ని చోట్లా ఫలితాలను వెల్లడించనున్నారు.
ఖమ్మం జిల్లాలో..
ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూర్, సింగరేణి మండలాల పరిధిలో ఉన్న 191 గ్రామ పంచాయతీలు, 1,742 వార్డులకు మూడవ విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ విడతలో ఒక సర్పంచ్, 9 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 22 గ్రామ పంచాయతీలు, 361 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, మిగిలిన 168 గ్రామ పంచాయతీలకు మొత్తం 485 మంది, 1,372 వార్డులకు మొత్తం 3,369 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
వీటి కోసం 2,091 బ్యాలెట్ బాక్సులతో 2,092 మంది పోలింగ్ అధికారులు, 2,637 మంది ఓపీఓ లు ఇప్పటికే ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మూడవ విడతలో 31 లొకేషన్స్ లోని 318 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించగా, అక్కడ సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. మొత్తం 2,44,283 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ఇందులో 1,18,900 మంది పురుష ఓటర్లు, 1,25,380 మంది మహిళా ఓటర్లు, ముగ్గురు ఇతరులు ఓటర్లుగా ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో స్వల్ప ఘటనలు మినహా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. తుది విడతలోనూ ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఎలక్షన్లు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు కారేపల్లి పోలింగ్ కేంద్రంలో బందోబస్తు ఏర్పాట్లను మంగళవారం సీపీ సునీల్ దత్ పరిశీలించారు.
భద్రాద్రి కొతగూడెం జిల్లాలో..
జిల్లాలోని ఆళ్లపల్లి, గుండాల, జూలూరుపాడు, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, టేకులపల్లి, ఇల్లెందు మండలాల్లో తుది విడత ఎన్నికలు జరుగనున్నాయి. ఏడు మండలాల్లోని 155 గ్రామపంచాయతీలున్నాయి. ఇందులో రెండు చోట్ల ఎన్నికలు జరగడం లేదు. ఎనిమిది పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 145 పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. 1,330 వార్డులకు గానూ మూడు వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు.
256 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 1,071 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. కాగా, తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కలెక్టర్ జితేశ్వి పాటిల్ పేర్కొన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామన్నారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుందన్నారు.
పోలింగ్ కేంద్రాల్లో రద్దీ లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఎన్నికల ఆఫీసర్లను ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీస్ బలగాలను మోహరించామని ఎస్పీ బి.రోహిత్‌రాజు పేర్కొన్నారు. కాగా, ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు మహిళా ఓటర్లపైనే ఆశలు పెట్టుకున్నారు. తుది విడత ఎన్నికలు జరిగే ఏడు మండలాల్లో 85,712 మంది పురుష ఓటర్లుండగా 89,359 మంది మహిళా ఓటర్లున్నారు.
ఖమ్మం జిల్లాలో మూడో విడత ఎన్నికల వివరాలు..
మండలం పంచాయతీలు వార్డులు ఓటర్లు
ఏన్కూరు 17 123 18,754
కల్లూరు 21 160 32,819
పెనుబల్లి 30 247 40,523
సత్తుపల్లి 18 168 32,477
సింగరేణి 35 255 41,795
తల్లాడ 24 205 42,384
వేంసూరు 23 214 35,531
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో మూడో విడత ఎన్నికల వివరాలు..
మండలం పంచాయతీలు వార్డులు ఓటర్లు పోలింగ్స్టేషన్లు
ఆళ్లపల్లి 12 84 9,314 90
గుండాల 09 78 12,092 80
జూలూరుపాడు 21 142 24,462 174
లక్ష్మీదేవిపల్లి 28 221 30,811 245
సుజాతనగర్ 12 80 13,598 102
టేకులపల్లి 36 244 42,068 312
ఇల్లెందు 27 222 42,729 255
మొత్తం 145 1,071 1,75,074 1258
