నువ్వా.. నేనా? .. క్యాండిడేట్ల ఫైనల్​ తో ప్రధాన పార్టీల ప్రచార హోరు

నువ్వా.. నేనా? .. క్యాండిడేట్ల ఫైనల్​ తో  ప్రధాన పార్టీల ప్రచార హోరు

జనగామ, వెలుగు : జనగామ జిల్లా లోని మూడు నియోజక వర్గాల్లో ప్రధాన పార్టీల క్యాండిడేట్లు ఫైనల్​ కావడంతో అసెంబ్లీ ఎలక్షన్​ ప్రచారం జోరందుకుంది. ‘నువ్వా.. నేనా’ అన్నట్లుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. చేరికల పై ప్రత్యేక నజర్​ పెట్టారు. ఏ లీడర్​ ఎంత మేర ఓట్లను ప్రభావితం చేస్తారనే సమీకరణలు చేస్తున్నారు. సదరు లీడర్లను తమ వైపు తిప్పుకునేందుకు వారి ఇండ్లకు వెళ్లి చర్చలు జరుపుతున్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభానికి మరో రెండు రోజుల గడువు మాత్రమే ఉండడంతో అభ్యర్థులు ప్రచారాన్ని స్పీడప్​ చేశారు. 

ఎక్కడ.. ఏ పరిస్థితి..? 

  • జిల్లాలోని జనరల్​ స్థానాలు జనగామ, పాలకుర్తి, ఎస్సీ రిజర్వ్​డ్​ స్టేషన్​ ఘన్​పూర్​కు ప్రధాన పార్టీలు క్యాండిడేట్లను ఇప్పటికే ఫైనల్​ చేశాయి. కాగా అందరికంటే ముందుగా అభ్యర్థులను బీఆర్​ఎస్​ ఖరారు చేయడంతో వారు ప్రచారంలో ముందు వరుసలో ఉన్నారు. 
  • జనగామలో సీఎం కేసీఆర్​ ప్రజా ఆశీర్వాద సభ సైతం పూర్తి కావడంతో అభ్యర్థి పల్లా రాజేశ్వర్​ రెడ్డి తన ప్రచార స్పీడ్​ పెంచారు. ఇప్పటికే చేర్యాల, కొమురవెల్లి, బచ్చన్నపేట, జనగామలలో ప్రచారం చేశారు. మంగళవారం జనగామ పట్టణంలోని 20, 21, 22, 28, 29, 30 వార్డుల్లోనూ ప్రచారం చేస్తూ బీఆర్ఎస్​ ను గెలిపించాలని కోరారు. 
  • జనగామ కాంగ్రెస్​ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్​ రెడ్డి  చేర్యాల, మద్దూరు, తరిగొప్పుల, బచ్చన్నపేట, జనగామ మండలాల్లో ప్రచారం నిర్వహించారు. మంగళవారం  తరిగొప్పుల మండలంలోని పోతారం, అక్కరాజుపల్లి, మరియాపూర్​, నర్సాపూర్​, అబ్దుల్​ నాగారం, తరిగొప్పులలో ఇంటింటి ప్రచారం చేశారు. జనగామ మండలం వడ్డకొండ, నర్మెట మండలం అమ్మాపురంకు చెందిన పలువురు యువత పెద్ద సంఖ్యలో కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు.
  • బీజేపీ జనగామ అభ్యర్థి ఆరుట్ల దశమంత్​ రెడ్డి మద్దూరు, తరిగొప్పుల మండలల్లో ప్రచారం చేపట్టారు. మంగళవారం బచ్చన్నపేటలో సన్నాహక సమావేశం నిర్వహించారు. అనంతరం ఇంటింటి ప్రచారం చేశారు. 
  • పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను దాదాపుగా కలియతిరిగారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ప్రచారాన్ని మరింత స్పీడప్​ చేశారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా తొలుత హనుమాండ్ల ఝాన్సీరెడ్డి అనుకున్నప్పటికీ పౌరసత్వ సమస్యతో ఆమె కోడలు యశస్విని రెడ్డి బరిలో నిలిచారు. కాగా ఝాన్సీరెడ్డి తన ప్రచార హోరు ను రెట్టింపు చేశారు. ఇక్కడి బీజేపీ అభ్యర్థి లేగ రామ్మోహన్​ రెడ్డి కూడా జోరుగా ప్రజల్లోకి వెళ్తూ కేంద్ర పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు.
  • స్టేషన్ ఘన్​పూర్​ లో అధికార పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి​ ప్రచార జోరు పెంచారు. కాంగ్రెస్​ అభ్యర్థి సింగపురం ఇందిర, బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి గుండె విజయరామారావు ప్రజల్లోకి వెళ్తూ తమదైన శైలిలో చేపట్టబోయే పనులను వివరిస్తూ తమను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఏదేమైనా ఎన్నికలు సమయంలో దగ్గర పడుతున్న కొద్దీ  ప్రచార హోరుతో అభ్యర్థులు, పార్టీల శ్రేణులు బిజిబిజీగా మారిపోతున్నారు. 

మేనిఫెస్టోలనే నమ్ముకున్నరు.. 

ప్రధాన పార్టీల అభ్యర్థులు మేనిఫెస్టోలనే నమ్ముకున్నారు. వ్యక్తిగత చరిష్మా కంటే పార్టీ గుర్తు పైనే ఆధార పడుతున్నారు. బీఆర్​ఎస్​ అభ్యర్థులు సంక్షేమ పాలన నినాదంతో ముందుకెళ్తున్నారు. పథకాల లబ్ధి పెంపు పై వచ్చే ఐదేండ్లలో ఒనగూరే ప్రయోజనాన్ని వివరిస్తున్నారు. కాంగ్రెస్​ ఆరు గ్యారెంటీ స్కీమ్​లను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. గడప గడపకు అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. అధికార పార్టీ పాలన పై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్రం ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన నిధులను బీజేపీ అభ్యర్థులు ప్రజలకు వివరిస్తున్నారు. నిధులు కేంద్రానివి అయితే పేరు కేసీఆర్​చెప్పుకుంటున్నారని ఇంటింటికి వెళ్లి చెబుతున్నారు.