మా దేశంలో ఖలిస్తానీ ఉగ్ర కార్యకలాపాలు నిజమే

మా దేశంలో ఖలిస్తానీ ఉగ్ర కార్యకలాపాలు నిజమే
  • తొలిసారి అంగీకరించిన కెనడా
  • మనీ లాండరింగ్, టెర్రర్ ఆపరేషన్లపై రిపోర్టు

ఒట్టావా: భారత్​కు వ్యతిరేకంగా ఖలిస్తానీ టెర్రర్  సంస్థ తమ దేశంలో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతోందని కెనడా అంగీకరించింది. ఈమేరకు కెనడా ఆర్థికశాఖ విడుదల చేసిన ఓ నివేదికలో ఖలిస్తానీ టెర్రరిస్టులు తమ దేశంలో ఉంటూ కార్యకలాపాలు జరుపుతున్నారని పేర్కొంది. 

కెనడా క్రిమినల్ కోడ్ లో చేర్చిన ఉగ్రవాద సంస్థలు హమాస్, హెజ్బొల్లా, ఖలిస్తానీ గ్రూపులు.. తదితర రాజకీయ ప్రేరేపిత సంస్థలకు పలు దేశాల నుంచి ఆర్థిక సాయం అందుతున్నట్లు తమ నిఘా వర్గాలు గుర్తించాయని పేర్కొంది.

 మనీలాండరింగ్ వ్యవహారాలు, వలస వచ్చిన కుటుంబాలు, ఎన్జీవోల నుంచి వీటికి నిధులు అందుతున్నాయని తెలిపింది. ఫండ్ రైజింగ్ కోసం  కెనడాలో వీటికి భారీ నెట్ వర్క్ ఉండేదని ఆ రిపోర్టులో పేర్కొంది. 

అయితే, ప్రస్తుతం ఈ నెట్ వర్క్ తగ్గిపోయిందని తెలిపింది. నిధుల కోసం ఈ సంస్థలు పలు నేరాలకు పాల్పడతాయని, వీటికి ప్రధాన ఆదాయ వనరు అదేనని తెలిపింది. 

కాగా.. ఖలిస్తానీ గ్రూపులు కెనడాలో ఆశ్రయం పొందుతూ భారత్​కు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేపడుతున్నాయని కేంద్ర ప్రభుత్వం కొన్నేండ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటి వరకూ ఈ ఆరోపణలను తోసిపుచ్చిన కెనడా.. తాజాగా తమ గడ్డపై ఖలిస్తానీ కార్యకలాపాలు జరుగుతున్నది వాస్తవమేనని ఒప్పుకుంది.