యూఎస్ ఓపెన్ టైటిల్ గెలిచిన బియాంక

యూఎస్ ఓపెన్ టైటిల్ గెలిచిన బియాంక

న్యూయార్క్‌‌: ఈసారి యూఎస్‌‌ ఓపెన్‌‌లో కొత్త చాంపియన్‌‌ పుట్టుకొచ్చింది. 24వ గ్రాండ్‌‌స్లామ్‌‌ వేటలో ఉన్న అమెరికా స్టార్‌‌ సెరెనా విలియమ్స్‌‌ ఆధిపత్యానికి గండికొడుతూ కెనడా భామ బియాంకా అండ్రెస్కూ సంచలనం సృష్టించింది. శనివారం అర్ధరాత్రి జరిగిన మహిళల సింగిల్స్‌‌ ఫైనల్లో 15వ సీడ్‌‌ అండ్రెస్కూ 6–3, 7–5తో 8వ సీడ్‌‌ సెరెనాపై గెలిచింది. తద్వారా కెనడా తరఫున గ్రాండ్‌‌స్లామ్‌‌ టైటిల్‌‌ నెగ్గిన తొలి ప్లేయర్‌‌గా 19 ఏళ్ల అండ్రెస్కూ రికార్డులకెక్కింది. అలాగే స్వెత్లానా కుజ్‌‌నెత్సోవా (2004 యూఎస్‌‌ ఓపెన్‌‌) తర్వాత స్లామ్‌‌ టైటిల్‌‌ సాధించిన యంగెస్ట్‌‌  ప్లేయర్‌‌గానూ ఘనత సాధించింది. ఇక ఓపెన్‌‌ ఎరాలో అత్యంత వేగంగా గ్రాండ్‌‌స్లామ్‌‌ టైటిల్‌‌ సాధించిన క్రీడాకారిణిగా మోనికా సెలెస్‌‌ (1990 వింబుల్డన్‌‌) సరసన చేరింది.  యూఎస్‌‌ ఓపెన్‌‌ మొయిన్‌‌ డ్రాకు ముందు అండ్రెస్కూకు కేవలం రెండు స్లామ్‌‌ మ్యాచ్‌‌లు ఆడిన అనుభవం మాత్రమే ఉంది. దానినే ఆయుధంగా చేసుకుంటూ టైటిల్‌‌ పోరులో ఫేవరెట్‌‌గా దిగిన సెరెనాకు చుక్కలు చూపెట్టింది. ఫలితంగా ఈ సీజన్‌‌లో టాప్‌‌–10 క్రీడాకారిణిలపై గెలిచిన రికార్డును 8–0కు పెంచుకుంది. టైటిల్‌‌ గెలిచిన అండ్రెస్కూ.. డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌‌లోనూ దూసుకుపోయింది. సోమవారం విడుదల కానున్న తాజా ర్యాంకింగ్స్‌‌లో ఈ కెనడియన్‌‌కు కెరీర్‌‌ బెస్ట్‌‌ ఐదో ర్యాంక్‌‌ దక్కనుంది.

నాలుగో‘సారీ’

24వ గ్రాండ్‌‌ స్లామ్‌‌ టైటిల్‌‌ కోసం సెరెనా ఆడిన నాలుగో ఫైనల్‌‌ ఇది. ఓవరాల్ కెరీర్‌‌లో 33వది. గతేడాది కూడా యూఎస్‌‌ ఓపెన్‌‌ ఫైనల్‌‌కు చేరిన అమెరికన్‌‌కు నవోమి ఒసాకా రూపంలో అడ్డంకి ఎదురైంది. అంతకుముందు మూడుసార్లు టైటిల్‌‌ పోరుకు అర్హత సాధించినా సెరెనాను విజయం వరించలేదు. గంటా 40 నిమిషాల పోరాటంలో అండ్రెస్కూ జోరుకు సెరెనా ఏమాత్రం అడ్డుకట్ట వేయలేకపోయింది. తొలిసెట్‌‌ తొలి గేమ్‌‌లోనే రెండు డబుల్‌‌ ఫాల్ట్‌‌లు చేసి సర్వీస్‌‌ను కోల్పోయింది. తర్వాత పరస్పరం సర్వీస్‌‌లు నిలబెట్టుకున్నా సెరెనా 2–4తో వెనుకబడింది. కీలకమైన ఏడో గేమ్‌‌లో అద్భుతమైన ఏస్‌‌లు, బలమైన గ్రౌండ్‌‌ స్ట్రోక్స్‌‌తో ఐదు బ్రేక్‌‌ పాయింట్లను కాచుకుని సర్వ్‌‌ను నిలబెట్టుకుని  స్కోరు 3–4కు పెంచుకుంది. ఎనిమిదో గేమ్‌‌లో అండ్రెస్కూ సర్వ్‌‌ను కాపాడుకోగా, తొమ్మిదో గేమ్‌‌లో సెరెనా సర్వీస్‌‌ను చేజార్చుకుంది. అండ్రెస్కూ కొట్టిన సెట్‌‌ పాయింట్‌‌ ఫోర్‌‌హ్యాండ్‌‌ విన్నర్‌‌ను అమెరికన్‌‌ సరిగ్గా రిటర్న్‌‌ చేయలేదు.

ఈ విజయం గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు. ఈ క్షణాల కోసం చాలా కష్టపడ్డా. ఈ ఏడాది నా కల సాకారమైంది. సెరెనాతో ఫైనల్‌‌ ఆడటం మర్చిపోలేనిది. ఆమెతో ఆడటం అంత సులువు కాదు. ప్రతి మ్యాచ్‌‌లాగే ఫైనల్‌‌ కోసం బాగా సిద్ధమయ్యా. ఎవరితో తలపడుతున్నాననే విషయాన్ని పట్టించుకోకుండా నా ఫోకస్‌‌ మొత్తం ఆటపైనే పెట్టా.  కలలు నెరవేర్చుకునేందుకు పోరాటం చేయండి. కొన్నిసార్లు పరాజయాలు ఎదురైనా అధైర్యపడొద్దు.  2015 ఆరెంజ్‌‌ బౌల్‌‌ టోర్నీ గెలిచినప్పుడే యూఎస్‌‌ ఓపెన్‌‌లో ఈ క్షణాలను ఊహించుకున్నా.

– అండ్రెస్కూ

 మ్యాచ్​ పాయింట్లు చేజారినా..

రెండోసెట్‌‌ రెండో గేమ్‌‌లో బ్రేక్‌‌ పాయింట్‌‌ వద్ద డబుల్‌‌ ఫాల్ట్‌‌ చేసిన సెరెనా సర్వీస్‌‌ను కోల్పోయింది. దీంతో అండ్రెస్కూ 2–0 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే మూడో గేమ్‌‌లో బలమైన రిటర్న్స్‌‌తో ఆకట్టుకున్న సెరెనా కెనడా ప్లేయర్‌‌ సర్వ్‌‌ను బ్రేక్‌‌ చేసింది. అండ్రెస్కూ నాలుగు బ్రేక్‌‌ పాయింట్లను కాచుకున్నా ఫలితం లేకపోయింది. తర్వాత అప్పటి వరకు జోరుగా ఆడిన సెరెనా.. నాలుగు, ఆరో గేమ్‌‌లో సర్వీస్‌‌ను చేజార్చుకోవడంతో అండ్రెస్కూ 5–1తో ఆధిక్యంలో నిలిచింది. ఏడో గేమ్‌‌లో 40–30 వద్ద అండ్రెస్కూ కొట్టిన చాంపియన్‌‌ షిప్‌‌ పాయింట్‌‌ను అడ్డుకున్న సెరెనా.. ప్రత్యర్థి సర్వ్‌‌ను బ్రేక్‌‌ చేసి మ్యాచ్‌‌లో నిలిచింది. ఎనిమిది, పదో గేమ్‌‌లో సర్వ్‌‌ను కాపాడుకున్న అమెరికన్‌‌.. తొమ్మిదో గేమ్‌‌లో అండ్రెస్కూ సర్వీస్‌‌కు చెక్‌‌ పెట్టడంతో స్కోరు 5–5తో సమమైంది. ఈ మధ్యలో సెరెనా 17 పాయింట్లలో 14 గెలవడం విశేషం. 11వ గేమ్‌‌లో అలవోకగా సర్వ్‌‌ను నిలబెట్టుకున్న అండ్రెస్కూ.. 12వ గేమ్‌‌లో 40–15 వద్ద తొలి మ్యాచ్‌‌ పాయింట్‌‌ను చేజార్చుకుంది. కానీ బలమైన ఫోర్‌‌హ్యాండ్‌‌ విన్నర్లతో చెలరేగిన అండ్రెస్కూ ఆ వెంటనే 40–30 వద్ద రెండో మ్యాచ్‌‌ పాయింట్‌‌ను కాపాడుకుని గెలిచింది.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి