న్యూఢిల్లీ: ఢిల్లీలో గాలి కాలుష్యంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో రెండ్రోజులు ఉంటేనే, అనారోగ్యానికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. వెటరన్ జర్నలిస్ట్ ఉదయ్ మహుర్కర్ రాసిన ‘మై ఐడియా ఆఫ్ నేషన్ ఫస్ట్’ పుస్తకావిష్కరణ బుధవారం ఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ.. ‘‘నేను రెండ్రోజులుగా ఢిల్లీలో ఉంటున్నాను. ఇంతలోనే ఇన్ఫెక్షన్‌కు గురయ్యాను. సిటీలో కాలుష్యం తీవ్రంగా ఉంది. నేను ట్రాన్స్‌పోర్టు మినిస్టర్‌ను.. వాహనాల వల్లనే 40% కాలుష్యం ఏర్పడుతున్నది. ఇందుకు కారణం మనం వాడుతున్న శిలాజ ఇంధనాలు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో నేషనలిజం అంటే దిగుమతులు తగ్గించుకుని ఎగుమతులు పెంచుకోవడమే. శిలాజ ఇంధనాల వల్ల నడిచే వాహనాల స్థానంలో బయో ఫ్యూయల్, ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను ప్రోత్సహించాలి. అప్పుడే మనం ఆత్మనిర్భర్ భారత్‌ను సాధించగలం” అని వ్యాఖ్యానించారు. ‘‘ముస్లింలు అందరూ టెర్రరిస్టులు అనడం సరికాదు. ఏపీజే అబ్దుల్ కలాం మన దేశ ఐకాన్. అలాంటి అబ్దుల్ కలాంలు మరెంతో మంది రావాలి. అది విద్య వల్లనే సాధ్యమవుతుంది” అని పేర్కొన్నారు. హిందూ, ముస్లిం ఇష్యూను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. కాగా, ‘‘కేంద్రంలో, ఢిల్లీలో బీజేపీనే అధికారంలో ఉంది. ఢిల్లీ కాలుష్యంపై కనీసం గడ్కరీ అయినా ధైర్యంగా నిజం ఒప్పుకున్నారు” అని కాంగ్రెస్ పేర్కొంది.
