- స్వచ్ఛమైన గాలి ఎలాగూ అందించలేరంటూ ఢిల్లీ హైకోర్టు ఫైర్
- రెండ్రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు
- జీఎస్టీ తగ్గింపును పరిశీలించాలని కౌన్సిల్‌కు సూచన
న్యూఢిల్లీ: దేశ రాజధాని సహా పలు ప్రాంతాల్లో గాలి కాలుష్యం తీవ్రంగా ఉంది.. కాలుష్యాన్ని ఎలాగూ కట్టడి చేయలేరు కనీసం ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీ అయినా తగ్గించలేరా అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. ఇలాంటి ఎమర్జెన్సీ పరిస్థితుల్లోనూ ఎయిర్ ప్యూరిఫైయర్లపై 18 శాతం జీఎస్టీ కొనసాగిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈమేరకు కేంద్రానికి నోటీసులు జారీ చేస్తూ, రెండ్రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఎయిర్ ప్యూరిఫైయర్లను మెడికల్ డివైజ్‌లుగా పరిగణించి, వాటిపై ప్రస్తుతమున్న 18% జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని కోరుతూ అడ్వకేట్ కపిల్ మదన్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తుషార్ రావు గేదెల ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్రాన్ని ఉద్దేశించి కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘మనం రోజుకు 21 వేల సార్లు శ్వాస తీసుకుంటాం. అలాంటప్పుడు గాలి కాలుష్యం వల్ల ఎంత నష్టం జరుగుతుందో ఓసారి లెక్కించండి. స్వచ్ఛమైన గాలిని ప్రజలకు అందించలేనప్పుడు.. కనీసం ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీ అయినా తగ్గించలేరా?” అని ప్రశ్నించింది.
మినహాయింపులివ్వండి..
ఈ పిటిషన్‌పై స్పందించేందుకు 15 రోజుల సమయం కావాలని కేంద్రం తరఫు అడ్వకేట్ కోరగా, హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘అంత టైమ్ ఎందుకు? వేలాది మంది చనిపోయేదాకా మేం వేచి చూడాలా? ఈ సిటీలో ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన గాలి అవసరం. మీరు అది అందించలేనప్పుడు.. కనీసం ఎయిర్ ప్యూరిఫైయర్లను అయినా వాళ్లకు అందుబాటు లో ఉంచాలి కదా! ఇలాంటి ఎమర్జెన్సీ టైమ్‌లో ఎయిర్ ప్యూరిఫైయర్లకు తాత్కాలిక మినహాయింపులు ఇవ్వలేరా?.. జీఎస్టీ కౌన్సిల్ ఎందుకు ఈ అంశాన్ని పరిశీలించడం లేదు? కౌన్సిల్ తదుపరి మీటింగ్ ఎప్పుడు ఉంది. ఆ మీటింగ్‌లో ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీని తగ్గించాలనే ప్రతిపాదనలు ఏమైనా ఉన్నాయా?” అని ప్రశ్నించింది. వీలైనంత త్వరగా జీఎస్టీ కౌన్సిల్ సమావేశమై, ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీని తగ్గించాలని సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది.
