పోలీస్ యూనిఫాంలో కనిపించి.. వృద్ధుడి డిజిటల్‌‌ అరెస్ట్..9 కోట్లు కొట్టేసిన సైబర్‌‌‌‌ ఫ్రాడ్స్‌‌

పోలీస్ యూనిఫాంలో కనిపించి.. వృద్ధుడి డిజిటల్‌‌ అరెస్ట్..9 కోట్లు కొట్టేసిన సైబర్‌‌‌‌ ఫ్రాడ్స్‌‌
  • మహారాష్ట్రలోని ముంబైలో ఘటన

ముంబై: పోలీసులమని బెదిరించి సైబర్​ నేరగాళ్లు ఓ వృద్ధుడి అకౌంట్‌‌ను కొల్లగొట్టారు. మనీలాండరింగ్, ఉగ్రవాద సంస్థలకు నిధుల మళ్లింప ఆరోపణలతో  భయపెట్టి రూ.9 కోట్లు కాజేశారు. మహారాష్ట్రలోని ముంబై  ఠాకూర్‌‌ ద్వార్ ప్రాంతంలో ఈ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. బాధిత వృద్ధుడు (85) తన కుటుంబంతో కలిసి ముంబైలో నివసిస్తున్నారు. 

నవంబర్ 28న ఆయనకు ఒక గుర్తుతెలియని ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి తనను తాను నాసిక్ పంచవటి పోలీస్ స్టేషన్ ఇన్‌‌స్పెక్టర్ దీపక్ శర్మగా పరిచయం చేసుకున్నాడు. బాధితుడి ఆధార్ కార్డు ఉపయోగించి ఎవరో బ్యాంక్ ఖాతా తెరిచారని, దాని ద్వారా భారీ స్థాయిలో మనీలాండరింగ్ జరుగుతోందని భయపెట్టాడు. సదరు ఖాతా నుంచి నిషేధిత సంస్థ (పీఎఫ్‌‌ఐ) కు నిధులు వెళ్లాయని, దీనిపై సీబీఐ, ఎస్ఐటీ దర్యాప్తు చేస్తున్నాయని నమ్మించారు.

పోలీస్‌‌ యూనిఫాంలో కనిపించి..

వీడియో కాల్ ద్వారా పోలీస్ యూనిఫాంలో కనిపించిన నిందితులు.. ‘డిజిటల్ ఇండియా’ పథకం కింద ఈ-ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నదని వృద్ధుడికి చెప్పారు. ఈ విషయం బయట ఎవరికీ చెప్పకూడదని, ‘డిజిటల్ అరెస్ట్’లో ఉన్నారని వృద్ధుడిని మానసిక ఒత్తిడికి గురిచేశారు. భయపడిపోయిన వృద్ధుడు ఫిక్స్‌‌డ్ డిపాజిట్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ అన్నీ విక్రయించి మొత్తం రూ. 9 కోట్లను పంపించారు.

ఫ్రాడ్‌‌ను గుర్తించిన బ్యాంక్ ఉద్యోగి.. 

నిందితులు డిసెంబర్ 22న మరో రూ. 3 కోట్లు కావాలని డిమాండ్ చేయడంతో వృద్ధుడు బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్గావ్ బ్రాంచ్‌‌కు వెళ్లారు. అక్కడ బ్యాంక్ ఉద్యోగికి అనుమానం రాగా.. వెంటనే ఆ ట్రాన్సాక్షన్‌‌ను నిలిపేసి.. వృద్ధుడి కుటుంబ సభ్యులను పిలిపించారు. కుటుంబ సభ్యులు వచ్చి ఎంక్వైరీ చేయగా.. ఇది సైబర్ మోసమని తేలింది.