పంచాయతీ ఫలితాలు చూసి కాంగ్రెస్కు భయం పట్టుకుంది : హరీశ్ రావు

పంచాయతీ ఫలితాలు చూసి కాంగ్రెస్కు భయం పట్టుకుంది : హరీశ్ రావు
  •     అందుకే ఎంపీటీసీ, జడ్పీటీసీ, కో ఆపరేటివ్ ఎన్నికలు పెట్టట్లే: హరీశ్​

నర్సాపూర్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూసి కాంగ్రెస్ వాళ్లకు భయం పట్టుకుందని.. అందుకే ఎంపీటీసీ, జడ్పీటీసీ, కోఆపరేటివ్ ఎన్నికలు పెట్టడం లేదని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. మెదక్ ​జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో గెలిచిన సర్పంచు, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లను బుధవారం సన్మానించారు. ఈ సమావేశానికి హరీశ్​ హాజరై మాట్లాడుతూ, సర్పంచ్​ ఎన్నికలకు ఏ సీఎం గతంలో ప్రచారం చేయలేదని, ఓటమి భయంతో రేవంత్ రెడ్డి ఊరు ఊరు తిరిగి ప్రచారం చేశాడన్నారు. 

అధికారంలో ఉన్న పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం స్థానాల్లో గెలుస్తుందని, కాంగ్రెస్ పార్టీ డబ్బు, మద్యం పారించినా, దౌర్జన్యం చేసినా బీఆర్ఎస్ 40 శాతం స్థానాలు గెలిచిందన్నారు. కాంగ్రెస్ పాలన అంత సగం సగం ఆగమాగంలాగా ఉందని, ఇచ్చిన ఒక్క హామీని నిలబెట్టుకోలేదని అన్నారు. కేబినెట్​లో లంబాడాలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదన్నారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, పార్టీ నాయకులు దేవేందర్ రెడ్డి, చంద్రాగౌడ్, గోపీ తదితరులు పాల్గొన్నారు.

రెడ్డిపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ తనిఖీ 

సర్పంచ్​ల సన్మాన కార్యక్రమానికి హాజరైన సందర్భంగా 24 గంటల కరెంట్ రావటంలేదని రెడ్డిపల్లి, మద్దూరు రైతులు వివరించగా.. హరీశ్ రావు రెడ్డిపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ ను తనిఖీ చేశారు. లాగ్ బుక్ లో కరెంట్ ఎన్ని గంటలు సరఫరా అవుతుందనేది పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు 24 గంటల కరెంట్​ ఇస్తున్నామంటున్నది, కానీ లాగ్ బుక్ చూస్తే 12 గంటల కరెంటు మాత్రమే సరఫరా చేస్తున్నట్టుగా ఉందన్నారు. రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలని డిమాండ్​ చేశారు.