ఏపీకి విద్యుత్‌‌ బకాయిలపై కేంద్ర ఉత్తర్వులు రద్దు

ఏపీకి విద్యుత్‌‌ బకాయిలపై కేంద్ర ఉత్తర్వులు రద్దు
  • ఏపీకి విద్యుత్‌‌ బకాయిలపై కేంద్ర ఉత్తర్వులు రద్దు
  • 6 వేల కోట్లు చెల్లించాలనడం న్యాయసూత్రాలకు విరుద్ధం: హైకోర్టు
  • వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచన

హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్​కు రూ.6 వేల కోట్ల విద్యుత్‌‌ బకాయిలు చెల్లించాలని తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఈ వివాదంలో కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని ప్రకటించింది. 30 రోజుల్లోగా ఏపీకి రూ.6,756.92 కోట్లు (అసలు రూ.3,441.78 కోట్లు, వడ్డీ, సర్‌‌చార్జీలు రూ.3,315.14 కోట్లు) చెల్లించాలని గత ఏడాది ఆగస్టు 29న కేంద్రం తెలంగాణకు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ శ్రవణ్‌‌కుమార్‌‌ల డివిజన్‌‌ బెంచ్‌‌ 65 పేజీల జడ్జిమెంట్‌‌ ఇచ్చింది.

కేంద్ర ఉత్తర్వులను రద్దు చేయాలంటూ తెలంగాణ సర్కార్, విద్యుత్‌‌ సంస్థలు వేర్వేరుగా వేసిన పిటిషన్లను అనుమతిస్తూ తీర్పు చెప్పింది. విద్యుత్‌‌ సంస్థల మధ్య వివాదంలో కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం చెల్లదని పేర్కొంది. రాష్ట్ర విభజన చట్టంలోని నిబంధన ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తితే చర్చలు, సంప్రదింపులు, ఆ తర్వాత ఆర్బిట్రేషన్‌‌ విధానంలో పరిష్కరించుకోవాలనే నిబంధనకు విరుద్ధంగా కేంద్ర ఉత్తర్వులు ఉన్నాయని పేర్కొంది. చట్టప్రకారం అందుబాటులో ఉన్న ఆ పరిష్కార వ్యవస్థలో వివాదాన్ని తేల్చుకోవాలంది. 

ఏపీ సీఎం లేఖ రాయడంతో వివాదం కేంద్రానికి చేరింది. విద్యుత్‌‌ బకాయిలను ఏపీకి చెల్లించాలని కేంద్రం తెలంగాణను ఆదేశించింది. రాష్ట్ర విభజన చట్టం సెక్షన్‌‌ 92 కింద ఆదేశాలు, గైడ్‌‌లైన్స్‌‌ ఇచ్చే అధికారం కేంద్రానికి ఉందని చెప్పింది. అయితే, తెలంగాణకు నోటీసు కూడా ఇవ్వకుండా నిర్ణయం తీసుకోవడం సహజ న్యాయసూత్రాల స్ఫూర్తిని దెబ్బతీసిందని కోర్టు తెలిపింది. కేంద్ర ఉత్తర్వులను సవాల్‌‌ చేస్తూ తెలంగాణ సదరన్, నార్తరన్‌‌ పవర్‌‌ డిస్ట్రిబ్యూషన్‌‌ కంపెనీ లిమిటెడ్‌‌లు, తెలంగాణ సర్కార్‌‌ 2022, సెప్టెంబర్‌‌లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి.