ఇక గ్రామాల్లోకే క్యాన్సర్ టెస్టులు.. జిల్లాకో మొబైల్ స్క్రీనింగ్ సెంటర్

ఇక గ్రామాల్లోకే క్యాన్సర్ టెస్టులు.. జిల్లాకో మొబైల్ స్క్రీనింగ్ సెంటర్
  • జిల్లాకో మొబైల్​ స్క్రీనింగ్​ సెంటర్​ ఇచ్చే యోచన
  • ఈ వ్యాన్లలో అత్యాధునిక ఎక్విప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌తోపాటు క్వాలిఫైడ్ సిబ్బంది 
  • ఎర్లీ స్టేజ్‌‌‌‌‌‌‌‌లో వ్యాధిని గుర్తించేందుకు ప్రభుత్వ నిర్ణయం 
  • బ్రెస్ట్, సర్వైకల్, ఓరల్ కాన్సర్ టెస్టుల నిర్వహణ 
  • మెడికల్ కాలేజీల్లోని డే కేర్ సెంటర్లతో అనుసంధానం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో క్యాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రాథమిక దశలోనే గుర్తించి, పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై క్యాన్సర్ పరీక్షల కోసం గ్రామీణ ప్రాంతాల ప్రజలు సిటీకి పరుగెత్తాల్సిన అవసరం లేకుండా.. స్థానికంగానే మొబైల్ సెంటర్ల ద్వారా స్క్రీనింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా.. ప్రతి జిల్లాకు ఒక మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాన్ని కేటాయించాలని ఆలోచిస్తున్నది. ఈ మొబైల్ సెంటర్ల ద్వారా గ్రామస్థాయి నుంచి స్క్రీనింగ్ నిర్వహించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తానికి కేవలం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఎంఎన్‌‌‌‌‌‌‌‌జే క్యాన్సర్ హాస్పిటల్ పరిధిలో ఒకే ఒక్క వాహనం ఉండగా.. త్వరలో జిల్లాకో వెహికల్‌‌‌‌‌‌‌‌తో స్క్రీనింగ్ నిర్వహించనున్నారు.

ఈ మొబైల్ స్క్రీనింగ్ సెంటర్లతో షెడ్యూల్ ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.  ఇందులో అత్యాధునిక ఎక్విప్‌‌మెంట్‌‌తోపాటు క్యాలిఫైడ్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. బ్రెస్ట్ క్యాన్సర్ కోసం మమ్మోగ్రఫీ, సర్వైకల్ క్యాన్సర్ కోసం పాప్ స్మియర్, ఓరల్ క్యాన్సర్ కోసం సంబంధిత ఎక్విప్‌‌మెంట్స్‌‌ ఏర్పాటు చేస్తారు. నిపుణులైన డాక్టర్లు, క్వాలిఫైడ్ నర్సింగ్ సిబ్బంది, రేడియాలజీ టెక్నీషియన్లు అందుబాటులో ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో క్యాంప్‌‌లు నిర్వహించి, అక్కడికక్కడే స్క్రీనింగ్ టెస్టులు చేస్తారు. ఒకవేళ ఎవరికైనా క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లు అనుమానం వస్తే,  వారిని చికిత్స కోసం హైదరాబాద్‌‌లో ఉన్న ఎంఎన్‌‌జే, నిమ్స్ హాస్పిటల్‌‌కు రిఫర్ చేస్తారు. ఒక సైకిల్ చికిత్స తర్వాత వారి జిల్లాలోని క్యాన్సర్ డే కేర్ సెంటర్‌‌‌‌కు రిఫర్ చేస్తారు. తదుపరి చికిత్స మొత్తం జిల్లా కేంద్రంలోనే కొనసాగుతుంది.

ప్రాణనష్టం తగ్గించడమే టార్గెట్ 

చాలామంది క్యాన్సర్‌‌‌‌ను చివరి దశలో గుర్తించడం వల్లే ప్రాణాల మీదకు వస్తున్నదని ప్రభుత్వం గుర్తించింది.  అందుకే ‘ఎర్లీ డిటెక్షన్ - సేవ్ లైఫ్’ నినాదంతో ముందుకెళ్తున్నది. ఈ క్రమంలోనే మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ నిర్ణయించారు. రాష్ట్రంలో ఇప్పటికే 14  ఏండ్ల బాలికలకు హెచ్‌‌పీవీ వ్యాక్సినేషన్‌‌ను ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఇప్పుడు జిల్లాకో మొబైల్ వాహనం అందుబాటులోకి వస్తే.. క్షేత్రస్థాయిలోనే వ్యాధిని పసిగట్టి మరణాల రేటును భారీగా తగ్గించవచ్చని భావిస్తున్నది. జిల్లా డే కేర్ సెంటర్ల పర్యవేక్షణలో ఈ మొబైల్ యూనిట్లు పనిచేయనున్నాయి.