హలో.. మీరు ఏ పార్టీకి ఓటేస్తరు!..మొదలైన సర్వేలు

హలో.. మీరు ఏ పార్టీకి  ఓటేస్తరు!..మొదలైన సర్వేలు
  •     అభ్యర్థుల గెలుపోటములపై మొదలైన సర్వేలు
  •     ఫోన్, సోషల్​ మీడియా ద్వారా ఓటర్ల నుంచి ఫీడ్​బ్యాక్
  •     ప్రధాన పార్టీల అభ్యర్థులపై అభిప్రాయ సేకరణ

హైదరాబాద్, వెలుగు:  ‘ఎన్నికల్లో మాదే అధికారం’ ఏ పార్టీ నోట విన్నా ఇదే మాట. వాళ్ల మాట సరే.. మరి జనం మాటేంటి? వాళ్లేం అనుకుంటున్నరు? ఎవరికి ఓటేస్తరు?.. ఈ విషయాలను తెలుసుకునేందుకు పలు సంస్థలు, పార్టీలు సర్వేలు ప్రారంభించాయి. అందులో భాగంగా నేరుగా ఓటర్లకు ఫోన్లు చేస్తున్నాయి. కస్టమర్​ కేర్​కి ఫోన్​ చేస్తే అవతలి వైపు ఎలాంటి రెస్పాన్స్​ వస్తుందో.. అదే పద్ధతిలో ఐవీఆర్ఎస్​ ద్వారా ఫోన్లు చేస్తూ జనాల నుంచి ఫీడ్​ బ్యాక్​ తీసుకుంటున్నారు. మీరు ఏ పార్టీకి ఓటేస్తరు.. ఎందుకు వేయాలనుకుంటున్నరు అంటూ ప్రశ్నలను సంధిస్తున్నారు. 

ఆ అభ్యర్థికే ఎందుకు.. !

ఇప్పటిదాకా వివిధ పార్టీలు, నేతలు కొంతమంది ఉద్యోగులను నియమించుకుని వారు చేసిన అభివృద్ధి పనులను జనాల్లోకి తీసుకెళ్లారు. ప్రజలకు ఫోన్​చేసి పార్టీకి సపోర్ట్​ చేయాలని విజ్ఞప్తి చేశారు. కానీ ఇప్పుడు కొన్ని సంస్థలు, పార్టీలు తమ పేరు చెప్పుకోకుండా  గెలుపోటములపై సర్వే మొదలుపెట్టాయి. ‘‘రాబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు.?  బీఆర్ఎస్​ అయితే 1, బీజేపీ అయితే 2, కాంగ్రెస్​ అయితే 3, ఇతర పార్టీలైతే 4 ప్రెస్​ చేయండి’’ అంటూ ఫోన్ చేసి జనాన్ని అడుగుతున్నారు. ఆ పార్టీ అభ్యర్థికే ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారనే అభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. అభ్యర్థి ప్రజలకు దగ్గరగా ఉంటున్నారా? అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు కృషి చేస్తున్నారా? వంటి ప్రశ్నలను సంధిస్తున్నారు. అంతేగాకుండా ఇంతకు ముందున్న ఎమ్మెల్యేకు సంబంధించిన వివరాలనూ అడిగి తెలుసుకుంటున్నారు. ఆ వెంటనే సర్వేని క్లోజ్​చేసి ఫోన్​కాల్ కట్​చేస్తున్నారు. 

సోషల్​ మీడియాలోనూ..

ఇటు సోషల్​మీడియా, పలు షార్ట్​న్యూస్​ వెబ్​సైట్లు కూడా అభ్యర్థుల  గెలుపోటములపై సర్వేలు నిర్వహిస్తున్నాయి. మీరు ఏ పార్టీకి ఓటేస్తారంటూ జస్ట్​మూడు ముక్కల్లో సర్వే జరుపుతున్నాయి. మూడు ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్​, బీజేపీ, కాంగ్రెస్​లలో  ఏ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారన్న ఒక్క ప్రశ్నతో కూడా సర్వే చేపడుతున్నారు. మరోవైపు..రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఇప్పటికే గ్రౌండ్​లెవెల్​లో సర్వే కోసం ప్రత్యేకంగా ఏజెన్సీలను నియమించుకున్నాయి. తమ అభ్యర్థుల గెలుపోటములకు ఉన్న అవకాశాలపై ఫోకస్ పెడుతున్నాయి. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చేలా కసరత్తులు చేస్తున్నాయి. బీఆర్ఎస్​ ఇప్పటికే అభ్యర్థుల పేర్లను ప్రకటించగా.. అభ్యర్థులపై సీక్రెట్​సర్వే జరుగుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ కూడా సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తామని స్పష్టం చేసింది. నేషన్​విత్ ​నమో సంస్థ బీజేపీ తరఫున  సర్వేలు చేస్తున్నది