జీఓ 46 వెంటనే రద్దు చేయండి..ఎస్ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థుల ఆందోళన

జీఓ 46 వెంటనే రద్దు చేయండి..ఎస్ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థుల ఆందోళన

హైదరాబాద్ : జీఓ నెంబర్ 46ను వ్యతిరేకిస్తూ.. కొత్తపేటలో ఎస్ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఎస్ఐ, కానిస్టేబుల్‌ నియామకాల్లో తీసుకువచ్చిన జీఓ 46ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో మాదిరిగానే నియామకాలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర స్థాయిలో నియమించే తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో జీఓ నెంబర్ 46 ప్రకారం.. ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు 53శాతం రిజర్వేషన్లు కల్పించి.. మిగతా జిల్లాలకు 47శాతం కేటాయిస్తున్నారని తెలిపారు. దీంతో జిల్లాల్లోని అభ్యర్థులకు 130 మార్కులు వచ్చినా ఉద్యోగం రాని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 

హైదరాబాద్ జిల్లాలో 80 మార్కులకే జాబ్​ వచ్చే అవకాశం ఉందన్నారు ఎస్ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులు. నోటిఫికేషన్ లో ఎక్కడా జిల్లాల ప్రస్తావన లేదని, సెలక్షన్ సమయంలో 46 జీవోను తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. జీఓ 46 ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో46ను రద్దు చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మీడియాతో మాట్లాడుతున్న సమయంలోనే ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేసి.. నాగోల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.