క్యాండిడేట్లకూ ఓ మేనిఫెస్టో..గెలిస్తే ఏం చేస్తామో అభ్యర్థుల సొంత హామీలు

క్యాండిడేట్లకూ ఓ మేనిఫెస్టో..గెలిస్తే ఏం చేస్తామో అభ్యర్థుల సొంత హామీలు
  • అభివృద్ధి, ఉపాధి కల్పనపై వాగ్దానాలు
  • సొంతంగా నిధులు ఖర్చు చేస్తామని ప్రకటనలు 
  • స్థానిక సమస్యలను పరిష్కరిస్తామని భరోసా

హైదరాబాద్, వెలుగు : లోక్ సభ ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు సొంత మేనిఫెస్టోలు తయారు చేసుకుంటున్నారు. స్థానిక సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. జాతీయ పార్టీలకు ఓవరాల్​గా మేనిఫెస్టో ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు కూడా వివిధ అంశాలపై మేనిఫెస్టోలను విడుదల చేస్తాయి. అయితే ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ పార్టీల ఎంపీ అభ్యర్థులు సొంత హామీలు ఇస్తున్నారు. 

పార్టీ మేనిఫెస్టోలకు అదనంగా వాటిని ప్రకటిస్తున్నారు. ఆయా లోక్ సభ సెగ్మెంట్లలో ప్రధానంగా ఏం సమస్యలు ఉన్నాయి, అక్కడి ప్రజలు ఏం కోరకుంటున్నారు, కేంద్రం నుంచి తీసుకువచ్చేవి ఏమైనా ఉన్నాయా వంటి వివరాలపై ఆరా తీస్తున్నారు. అలాగే అభివృద్ధి, ఉపాధికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ హామీలు ఇస్తున్నారు. కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ కూడా తాను పోటీచేస్తున్న నాగ్​పూర్​ నియోజకవర్గానికి ప్రత్యేకంగా మెనిఫెస్టోను ప్రకటించారు. అదేమాదిరి తెలంగాణలోనూ స్థానిక సమస్యలను తీసుకుని కొందరు ఎంపీ అభ్యర్థులు వాగ్దానాలు చేస్తున్నారు. కొందరు క్యాండిడేట్లు కార్పొరేట్​ సోషల్​ రెస్పాన్సిబిలిటీ కింద నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు.

రూ.వంద కోట్లతో డెవలప్​మెంట్: వెంకట్రామిరెడ్డి​ 

తాను ఎంపీగా ఎన్నికైన వెంటనే పీవీఆర్ ట్రస్టు ఏర్పాటు చేసి సేవలందిస్తానని మెదక్  బీఆర్ఎస్​ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి హామీ ఇచ్చారు. ఇందు కోసం రూ.100 కోట్లు ఏర్పాటు చేసుకుని పేద పిల్లల చదువు, ఉద్యోగ, ఉపాధితో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ఏటా రూ.20 కోట్లు ఖ‌ర్చుపెడతానని ఆయన చెబుతున్నారు. అలాగే ఏడు నియోజకవర్గాల్లో సుమారు రూ.2 కోట్లు ఖర్చుపెట్టి ఫంక్షన్  హాల్ నిర్మిస్తానని ప్రకటించారు. 

మల్కాజిగిరి బీజేపీ ఎంపీ క్యాండిడేట్  ఈటల రాజేందర్​ కూడా ఆ లోక్ సభ సెగ్మెంట్​లో గేటెడ్​ కమ్యూనిటీలకు సొంతంగా హామీలు ఇస్తున్నారు. అభివృద్ధి, అందుబాటులో విద్య, వైద్యంపై చేవెళ్ల కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి రంజిత్​ రెడ్డి సొంత హామీలు ఇస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు, పీహెచ్​సీల ఏర్పాటుకు కృషి చేస్తానని ప్రచారం చేస్తున్నారు. ఇదే స్థానం నుంచి పోటీలో ఉన్న కొండా విశ్వేశ్వర్​ రెడ్డి కూడా చేవెళ్ల స్థానానికి ఎంపీగా గెలిపిస్తే యువతకు ఉద్యోగాలు కల్పించే కార్యక్రమాలు చేపడుతామని హామీ ఇచ్చారు. 

దానితో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తానని చెబుతున్నారు. భువనగిరి నుంచి పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి బూరనర్సయ్య గౌడ్, కాంగ్రెస్  అభ్యర్థి చామల కిరణ్​ కుమార్​ రెడ్డి కూడా సొంత హామీలు ఇస్తున్నారు. రోడ్లు, కుల సంఘాల భవనాల వంటివి వాటితో పాటు ఏ అసెంబ్లీ నియోజకవర్గానికి అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వాగ్దానాలు చేస్తున్నారు. 

పరిశ్రమల స్థాపనపై ఎక్కువగా హామీలు

యువతను లక్ష్యంగా చేసుకుని అభ్యర్థులు హామీలు ఇస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపడతామో చెబుతున్నారు. తాము గెలిస్తే పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామని, దీంతో స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని ఎక్కువ మంది ఎంపీ అభ్యర్థులు పేర్కొంటున్నారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్​ నుంచి గడ్డం వంశీ పోటీ చేస్తున్నారు. 

ఆయన స్థానిక సమస్యలపై ముందే అధ్యయనం చేసి అక్కడి ప్రజల అవసరాలను తీరుస్తానని హామీ ఇస్తున్నారు. పెద్దపల్లి లోక్ సభ సెగ్మెంట్​లో సింగరేణి కార్మికులు ఎక్కువగా ఉన్నారు. వారిని దృష్టిలో పెట్టుకుని సింగరేణి కార్మికుల సొంతింటి కలను నెరవేరుస్తానని వంశీకృష్ణ చెబుతున్నారు. అలాగే సింగరేణిలో కొత్త బొగ్గు బావులు నెలకొల్పి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని ప్రచారం చేస్తున్నారు. కార్మికులకు ఇన్​కమ్​ట్యాక్స్  మినహాయింపు,  రూ.30 కోట్ల సింగరేణి నిధులు తెప్పించే బాధ్యత వంటివన్నీ కాంగ్రెస్​ మేనిఫెస్టోకి అదనమని ఆయన తెలిపారు.