టీఎస్పీఎస్సీ ఆఫీసు ముందు ఉద్రిక్తత.. గ్రూప్ 2 వాయిదాకు అభ్యర్థుల డిమాండ్

టీఎస్పీఎస్సీ ఆఫీసు ముందు ఉద్రిక్తత.. గ్రూప్ 2 వాయిదాకు అభ్యర్థుల డిమాండ్

హైదరాబాద్ లోని టీఎస్పీఎస్సీ ఆఫీసు ముందు ఉద్రిక్తత కొనసాగుతోంది. గ్రూపు 2 పరీక్ష వాయిదా వేయాలంటూ అభ్యర్థులు టీఎస్పీఎస్సీ ఆఫీసు ముందు ఆందోళనకు దిగారు. గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేస్తామని స్పష్టమైన ప్రకటన వస్తేనే తాము ధర్నా విరమిస్తామంటున్నారు అభ్యర్థులు.

మరోవైపు..  టీఎస్పీఎస్సీ ఆఫీసు వద్ద పోలీసు బలగాలు పెద్ద సంఖ్యలో మోహరించాయి. ఇప్పటికే కొంతమంది అభ్యర్థులతో సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు చర్చలు జరిపారు. స్పష్టమైన ప్రకటన రాకపోయేసరికి ఆందోళనను మరింత తీవ్రం చేశారు అభ్యర్థులు.

నిరసనలు ఆపకపోతే అరెస్ట్ చేస్తామని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు అభ్యర్థులను హెచ్చరించారు. అయినా అభ్యర్థులు వెనక్కి తగ్గడం లేదు. ఏం చేసినా కదిలేది లేదని స్పష్టం చేస్తున్నారు. గ్రూప్ 2 ఎకానమీ పేపర్ లో అదనపు సిలబస్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థులు. 

48 గంటల్లో TSPSC నుండి అభ్యర్థులకు అనుకూలమైన ప్రకటన వస్తుందని పోలీసులు చెబుతున్నారు. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం, TSPSCపై తమకు నమ్మకం లేదంటున్నారు అభ్యర్థులు. మంత్రి కేటీఆర్ లేదా TSPSC చైర్మన్ వచ్చి తమకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. శాంతియుతంగా ధర్నా చేసుకుంటామని కోదండరాం కోరితే గంట సమయం మాత్రమే పర్మిషన్ ఇచ్చామన్నారు. మూడుగంటలుగా ఆందోళన చేస్తున్నారని, నిరసనలు విరమించకపోతే అరెస్ట్ తప్పదని హెచ్చరించారు సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు. TSPSCకి ప్రత్యేక బలగాలు తెప్పిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే TSPSCకు టాస్క్ ఫోర్స్, పోలీసుల వజ్ర వాహనాలు చేరుకున్నాయి.