మ‌హారాష్ట్ర‌లో గ‌ణేష్ ఉత్స‌వాల‌కు సుప్రీం నో

మ‌హారాష్ట్ర‌లో గ‌ణేష్ ఉత్స‌వాల‌కు సుప్రీం నో

హైద‌రాబాద్‌: క‌రోనా క్ర‌మంలో ఈ ఏడాది మ‌హారాష్ట్రలో గ‌ణేశ్ ఉత్స‌వాల‌ను భారీ ఎత్తున నిర్వ‌హించేందుకు అనుమ‌తి ఇవ్వ‌లేమ‌ని తెలిపింది సుప్రీంకోర్టు. ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ వేళ జ‌నం భారీగా గుమ్మికూడే అవ‌కాశాలు ఉన్న‌ట్లు కోర్టు తెలిపింది. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఎటువంటి అనుమ‌తి ఇవ్వ‌లేమ‌ని చీఫ్ జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డే తెలిపారు. గ‌ణేశ్ చతుర్థి ఉత్స‌వాలు అంటేనే భారీ జ‌న‌స‌మూహామ‌ని సీజే చెప్పారు. జ‌న ప్ర‌వాహాన్ని అదుపు చేయ‌లేం కాబ‌ట్టి.. వినాయ‌కుడి వేడుక‌ల‌కు అనుమ‌తి ఇవ్వ‌లేమ‌ని కోర్టు చెప్పింది.

జైన ఆల‌యాల‌ను తెరిచేందుకు అనుమ‌తి ఇవ్వాలంటూ దాఖ‌లైన పిటిష‌న్‌పై విచారించిన కోర్టు ఈ సంద‌ర్భంగా ఈ వ్యాఖ్య‌లు చేసింది. అయితే మ‌హారాష్ట్ర‌లోని దాద‌ర్‌, చెంబూర్‌, బైకులా జైన ఆల‌యాల‌ను తెరిచేందుకు మాత్రం కోర్టు అనుమ‌తి ఇచ్చింది. పూర్తి నిబంధ‌న‌ల మ‌ధ్య ఆల‌యాల‌ను తెర‌వాల్సి ఉంటుంది. గ‌ణేశ్ ఉత్స‌వాల నిర్వ‌హ‌ణపై రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే తుది నిర్ణ‌యం తీసుకోవ‌చ్చు అని తెలిపింది‌‌ కోర్టు.