
కొన్ని నెలలుగా మట్టి పనులు మాత్రమే జరుగుతున్నయ్
ఇంచు కూడా ముందుసాగని ఎల్లూరు పంపుహౌస్
మట్టికొరతతో నిలిచిన రిజర్వాయర్ కట్ట నిర్మాణం
జూన్‌లోనే నీళ్లు పారిస్తామని సీఎం కేసీఆర్ హామీ
సీఎం టూర్ పూర్తై 6 నెలలు గడిచినా ప్రాజెక్టులో కదలిక లేదు
వర్క్ ఏజెన్సీలకు రూ.1,217 కోట్ల బిల్లులు పెండింగ్
హైదరాబాద్, వెలుగు: పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పాలకులు పట్టించుకోవడం లేదు. ప్రాజెక్టులో కీలకమైన పంపుహౌస్‌ల నిర్మాణం ఇంచు కూడా ముందుకు పడలేదు. మట్టి కొరతతో నార్లాపూర్ రిజర్వాయర్ కట్ట నిర్మాణం కూడా ఆగిపోయింది. కొన్నిచోట్ల మట్టి పనులు మాత్రమే కొనసాగిస్తున్నారు. అది కూడా ఒక్క టీఎంసీ నీటిని తరలించే పనులనే చేపడుతున్నారు. గతేడాది ప్రాజెక్టును పరిశీలించిన సీఎం కేసీఆర్ ఈ ఏడాది జూన్‌లో పాలమూరు నుంచి నీళ్లు పారిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆరు నెలలు గడిచినా ఇప్పటి వరకూ ప్రాజెక్టు గురించి సీఎం ఎలాంటి సమీక్షా చేయలేదు. దీంతో ప్రాజెక్టు భవితవ్యం ఏమిటనే దానిపై ఇంజనీర్లే ఒక అంచనాకు రాలేకపోతున్నారు.
ఆరు నెలలు గడిచినా కదలిక లేదు
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న నార్లాపూర్, వట్టెం, ఏదుల రిజర్వాయర్లను గతేడాది ఆగస్టు 29న సీఎం కేసీఆర్ పరిశీలించారు. పనులపై సమీక్షించిన సీఎం జూన్ నుంచి పాలమూరు నీళ్లు ఎత్తిపోసి.. కనీసం మూడు నుంచి నాలుగు లక్షల ఎకరాల భూమికి నీళ్లిస్తామని తెలిపారు. ప్రాజెక్టులో మొదటి రిజర్వాయర్ నార్లాపూర్, ఫస్ట్ పంపుహౌస్ ఎల్లూరుపై అనేక సందేహాలు ఉండగా తానే క్లారిటీ ఇస్తానని చెప్పిన సీఎం ఇప్పటికీ వాటిపై నోరు విప్పడం లేదు. సీఎం పాలమూరు టూర్‌కు వెళ్లొచ్చి ఆరు నెలలు గడిచినా ఇప్పటికీ ఆ ప్రాజెక్టు పనులపై ఒక్కసారి కూడా రివ్యూ చేయలేదు. ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన రజత్‌కుమార్ గత నెల 20న ప్రాజెక్టు పనులను పరిశీలించి గ్రౌండ్ లెవల్లో ఉన్న పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ నెలలో బడ్జెట్ సమావేశాలు ఉండటంతో ఇప్పటికిప్పుడు ప్రాజెక్టు పనులపై సీఎం నుంచి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం లేదు. ఏప్రిల్‌లోనైనా పనులు ముందుకు పడతాయా? లేదా? అని ఇంజనీర్లే ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పంప్‌హౌస్, రిజర్వాయర్‌పై నిర్ణయం తీసుకోని సీఎం
ప్రాజెక్టు మొదటి దశలో ఉద్దండపూర్ రిజర్వాయర్ వరకు చేయాల్సిన పనులను 18 ప్యాకేజీలుగా విభజించి వర్క్ ఏజెన్సీలకు అప్పగించారు. శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను అప్రోచ్ చానల్ ద్వారా ఎల్లూరు పంపుహౌస్‌కు తరలించి అక్కడి నుంచి 104 మీటర్ల ఎత్తుకు నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోస్తారు. మొదట ఎల్లూరు పంపుహౌస్‌ను అండర్‌గ్రౌండ్‌లో డిజైన్ చేశారు. అప్రోచ్ చానల్, అండర్ టన్నెల్, సర్జ్‌పూల్ పనులు చేపట్టారు. 50% పనులు చేశాక ఓపెన్ పంపుహౌస్‌కు వెళ్లాలని సీఎం సూచించడంతో పనులు ఆపేశారు. ఓపెన్ పంపుహౌస్ కోసం కోర్ డ్రిల్లింగ్, భూమి పరీక్షలు చేసి సీఎం ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. నార్లాపూర్ రిజర్వాయర్ కట్ట నిర్మాణానికి మట్టి కొరత నేపథ్యంలో రాక్‌ఫిల్ డ్యాం చేపట్టేందుకు ఇంజనీర్లు ప్రపోజల్స్ రెడీ చేయించారు. మొదట ఒకే అన్న సీఎం తర్వాత నిర్ణయం మార్చుకున్నారు. రిజర్వాయర్ కెపాసిటీని 2 టీఎంసీలు తగ్గించుకుని ఉన్న మట్టితోనే కట్ట నిర్మించాలని చెప్పి తర్వాత హోల్డ్‌లో పెట్టారు. కీలకమైన పంపుహౌస్, రిజర్వాయర్ కట్టపై సీఎం నిర్ణయం తీసుకోకపోవడంతో పనులు నిలిచిపోయాయి.
రూ.1,217 కోట్ల బిల్లులు పెండింగ్
ప్రాజెక్టు కోసం 21,964 ఎకరాల ప్రైవేటు భూములు సేకరించాల్సి ఉండగా ఇప్పటి వరకు 19,459 ఎకరాల భూమి సేకరించారు. నార్లాపూర్ రిజర్వాయర్‌ను రూ.760 కోట్లతో నిర్మించాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.425 కోట్ల పనులు చేశారు. ఏదుల రిజర్వాయర్‌కు రూ.664 కోట్లు కేటాయించగా రూ.622 కోట్ల పనులు కంప్లీట్ చేశారు. వట్టెం రిజర్వాయర్ పనులను రూ.6 వేల కోట్లతో చేపట్టగా రూ.1,800 కోట్ల పనులు చేశారు. నార్లాపూర్ నుంచి ఏదుల వరకు 8.37 కి.మీ.ల కాలువ పనుల్లో 50%, ఏదుల నుంచి వట్టెం వరకు 6.4 కి.మీ.ల కాలువ పనుల్లో 80% పూర్తి చేశారు. వట్టెం నుంచి కరివెన వరకు 12 కి.మీ.ల కాలువ పనుల్లో 70 శాతానికిపైగా చేశామని ఇంజనీర్లు చెప్తున్నారు. రూ.35,200 కోట్లతో పాలమూరు పనులకు అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్ ఇవ్వగా 2015–16 నుంచి 2019–20 వరకు బడ్జెట్‌ల్లో ప్రభుత్వం రూ.16,822.14 కోట్ల కేటాయింపులు చేసింది. ఇందులో భూసేకరణకు రూ.1,234 కోట్లు ఖర్చు చేయగా, ప్రాజెక్టు పనులకు రూ.6,002.57 కోట్లు వెచ్చించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,905.14 కోట్లు కేటాయించగా ఇప్పటి వరకు రూ.1,695.14 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో వర్క్ ఏజెన్సీలకు రూ.1,217.19 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది.
తెచ్చిన అప్పులో రూ.600 కోట్లే ఖర్చు
కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ నుంచి రూ.600 కోట్లతో పనులు చేపట్టగా అందులో రూ.582 కోట్ల బిల్లులు చెల్లించారు. పాలమూరు పంపుహౌస్‌లను పూర్తి చేయడానికి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి కాళేశ్వరం కార్పొరేషన్ రూ.10 వేల కోట్ల అప్పు తీసుకునేందుకు గతంలోనే అగ్రిమెంట్ చేసుకుంది. పంపుహౌస్‌ల పనులు చేస్తూ సంబంధిత బిల్లులు సమర్పిస్తే లోన్ ఎమౌంట్ రిలీజ్ అవుతుంది. అప్పు తెచ్చి ఆరు నెలలవుతున్నా కొద్దిపాటి పనులే చేయడంతో ఆ మేరకు లోన్ ఎమౌంట్ రిలీజ్ అయ్యింది. ఎల్లూరు నుంచి మూడు దశల్లో నీటిని ఎత్తిపోస్తే కరివెన వరకు నీటిని అందించే అవకాశముంది. మధ్యలో 3.29 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఆశించిన స్థాయిలో పనులు చేసి ఉంటే ఇందులో సగం ఆయకట్టుకైనా వచ్చే వానాకాలంలో నీళ్లు అందేవి. సీఎం పంపుహౌస్‌లపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మొత్తంగా ఆ పనులు ఆగిపోయాయి. దీంతో 2021లోనే ప్రాజెక్టు నీళ్లు అందే అవకాశమున్నట్టు ఇంజనీర్లు చెప్తున్నారు.