ఈసీ నిర్ణయంలో జోక్యం చేసుకోలేం

ఈసీ నిర్ణయంలో జోక్యం చేసుకోలేం
  • దళిత బంధు నిలిపివేతపై ఈసీ నిర్ణయంలో జోక్యం చేసుకోలేం

స్కీం ఆపాలన్న ఈసీ నిర్ణయాన్ని తప్పుబట్టలేమని వెల్లడి

  • స్పష్టం చేసిన హైకోర్టు 

హైదరాబాద్, వెలుగు: దళిత బంధు నిలిపివేతకు సంబంధించి ఈసీ తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. రెండు రోజుల్లో ఉప ఎన్నిక పోలింగ్‌‌‌‌ జరగనుందని, ఈ టైమ్​లో దళితబంధును కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించే బాధ్యత ఈసీదని, ఇందుకోసం ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టలేమని తీర్పు వెలువరించింది. చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ సతీశ్‌ చంద్రశర్మ, జస్టిస్‌‌‌‌ ఎ.రాజశేఖర్‌‌‌‌రెడ్డిల బెంచ్​గురువారం తీర్పు చెప్పింది. ఈసీ ఈ నెల18న తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమంటూ.. జర్నలిస్ట్‌‌‌‌ మల్లేపల్లి లక్ష్మయ్య, కాంగ్రెస్‌‌‌‌ పార్టీ లీడర్ జడ్సన్‌‌‌‌ దాఖలు చేసిన పిల్స్ ను హైకోర్టు కొట్టేసింది. హుజూరాబాద్‌‌‌‌ ఎన్నిక పూర్తయ్యే వరకు దళితబంధు పథకం అమలును నిలిపివేయాలని వాచ్‌‌‌‌ వాయిస్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ది పీపుల్‌‌‌‌ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్​లోనూ జోక్యం చేసుకునేదేమీ లేదని స్పష్టం చేసింది. 
ఈసీ నిర్ణయం సబబే..
“ఉప ఎన్నిక పూర్తి అయ్యే వరకు దళితబంధు అమలును నిలిపివేయాలని ఈసీ ఈ నెల 18న జారీ చేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడం లేదు. ఎన్నికల నోటిఫికేషన్‌‌‌‌ తర్వాత ఈనెల 1వ తేదీ నాటి ప్రభుత్వ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయం సబబే. ఎలక్షన్​ కోడ్​అమల్లోకి వచ్చిన తర్వాత ఈసీకి రాజ్యాంగంలోని 324 అధికరణం ద్వారా అధికారాలు ఉంటాయి. ఎస్‌‌‌‌.సుబ్రహ్మణ్యం బాలాజీ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం కూడా ఈసీ నిర్ణయం రాజ్యాంగబద్ధమే. ఈ నెల1 నుంచి ఎన్నికల కోడ్​అమల్లోకి వచ్చింది. దళితబంధు పథకంతో నేరుగా ఓటర్ల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు జమ అవుతుంది. ఈ నేపథ్యంలో దళితబంధు పథకం ఆపాలన్న ఈసీ నిర్ణయాన్ని తప్పుబట్టలేం” అని హైకోర్టు తీర్పులో పేర్కొంది.