పద్మారావునగర్, వెలుగు: కంటోన్మెంట్ ప్రాంతం జీహెచ్‌ఎంసీలో విలీనం అయ్యే వరకు తన పోరాటం ఆగదని, ప్రాణం పోయినా వెనకడుగు వేయబోనని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు. సోమవారం ఏడో రోజు ఆయన నిరాహార దీక్షను కొనసాగించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, కంటోన్మెంట్ విలీనంపై స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ అవగాహన లేకుండా మాట్లాడటం సరికాదన్నారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నామినేటెడ్ వ్యవస్థను రద్దు చేసి, కంటోన్మెంట్ బోర్డును వెంటనే మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయాలని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు.
ప్రస్తుత చట్టాలే అభివృద్ధికి అడ్డంకిగా మారాయని ఆయన వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు సంఘీభావం తెలిపారు.
