
మూడేళ్ల కిందట మహారాష్ట్ర లాతూర్‌లో కరువొచ్చింది. రైళ్లలో నీటిని తరలించాల్సినంత పరిస్థితి. గతేడాది దక్షిణ ఆఫ్రికాలోని కేప్‌టౌన్‌లోనూ ఇలాంటి ఇబ్బందే. నీళ్లు లేక జనాలు అల్లాడిపోయారు. ఇప్పుడు చెన్నైలోనూ నీళ్ల కరువే. పైగా ఈ ఏడాది వర్షాకాలం వచ్చి నెల దాటినా వానలు పడింది కొంతే. దేశంలోని చాలా చోట్ల వానలు పడ్డ దాఖలాల్లేవు. ప్రాజెక్టులు, బావులు, నదులు నీటి కోసం నోర్లు తెరుచుకొని ఉన్నాయి. నీళ్లు లేక ఇప్పటికే చాలా సిటీలు ఎర్ర జెండా ఎత్తేశాయి. ఇంకొన్ని రోజులు వర్షాలు పడకపోతే ‘నీళ్లో రామచంద్ర’ అనాల్సిందే. అందుకే ప్రపంచవ్యాప్తంగా దేశాలు ఆల్టర్నేటివ్స్ కోసం వెతుకున్నాయి. సీ వాటర్ వైపు చూస్తున్నాయి. ఉప్పు నీళ్లను మంచి నీటిగా మార్చేందుకు ట్రై చేస్తున్నాయి. కొత్త కొత్త టెక్నాలజీలను కనుగొంటున్నాయి. వీటిల్లో ప్రస్తుతం బాగా వాడుతున్నది డీసాలినేషన్. మరి ఈ ప్లాంట్లు అంతలా యూజ్ అవుతాయా? డిమాండ్‌కు తగ్గట్టు నీళ్లిస్తయా? తక్కువ ఖర్చులో పనైపోతుందా? నీళ్ల కోసం కొత్త టెక్నాలజీలేమైనా వస్తున్నాయా?
ఏంటీ డీసాలినేషన్ టెక్నాలజీ?
ఉప్పు నీటిని మంచి నీటిగా మార్చేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వాడుతున్న టెక్నాలజీ రివర్స్ ఆస్మోసిస్. 1950ల్లోనే అందుబాటులోకి వచ్చింది. ఉప్పు నీటిని సముద్రం నుంచి తీసుకోడం, ప్లాంట్‌లోకి పంపడం, అక్కడ ఉప్పును తొలగించి సముద్రపు నీటిని మంచి నీళ్లుగా మార్చడం దీంట్లో జరిగే పని. ఆర్వో ప్లాంట్‌లో తక్కువ నుంచి ఎక్కువ కాన్సన్‌ట్రేషన్ వైపు నీరు వెళ్తుంది. అంటే ద్రావకం సాధారణ ప్రవాహానికి వ్యతిరేకంగా రివర్స్ ఆస్మాసిస్‌లో పని జరుగుతుంది. ఒత్తిడిని పెంచి రకరకాల మిక్చర్స్, మెంబ్రేన్స్ (తొడుగులు) నుంచి నీరు పంపుతారు. దీంతో నీటి నుంచి ఉప్పు విడిపోతుంది. సీ వాటర్‌లో లీటర్ నీటికి 35 గ్రాముల (35 వేల పీపీటీ) ఉప్పుంటుంది. దీన్ని 200 నుంచి 500 పీపీటికి తగ్గించడమే ఆర్వో ప్లాంట్ల పని. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లో18 వేల ఆర్వో ప్లాంట్లున్నాయి. ఇజ్రాయెల్‌లోనైతే సగం జనాభాకు నీళ్లిస్తోంది డీసాలినేషన్ ప్లాంట్లే.
ఆర్వో ప్లాంట్లతో ప్రాబ్లమేంటి?
ప్లాంట్ నుంచి ఫ్రెష్ వాటర్‌ను బయటకు పంపాక ఎక్కువ ఉప్పున్న నీరు, వేస్ట్ మిగులుతుంది. ఈ మిగిలిన ఉప్పు, వేస్ట్‌ను చెన్నైలో సముద్ర తీరంలో పడేస్తున్నారని ఫిషర్మెన్ ఇప్పటికే కంప్లైంట్ చేశారు. దీంతో రొయ్యలు, చిన్న చిన్న చేపలు, తైల చేపలు ఒడ్డుకు వస్తలేవంటున్నారు. ఇలా తీరంలో ఉప్పు సాంద్రత ఎక్కువుంటే, సముద్రంలో చిన్న చిన్న మొక్కలు పెరగవని, చేపలకు ఆహారం ఉండదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. పైగా సముద్ర నీటిని ప్లాంట్లలోకి పంపేందుకు హై ప్రెజర్ మోటార్లు వాడుతుంటారని, ఆ టైంలో చిన్న చిన్న చేపలు, గుడ్లు నీళ్లతోపాటే వచ్చేస్తుంటాయని చెబుతున్నారు.
ఆర్వో నీళ్లు ఎట్లుంటయ్?
ఆర్వో ప్లాంట్లు శుద్ది చేసిన నీటిలో కాల్షియం, మెగ్నీషియం, జింక్, సోడియం, పొటాషియం, కార్బొనేట్స్ ఉండవని కొందరు అంటున్నారు. వీటినే మొత్తంగా టీడీఎస్ అంటారు. సముద్రపు నీటిలో ఎక్కువ స్థాయిలో ఈ టీడీఎస్ ఉండటం వల్ల కొద్ది కాలానికే ప్లాంట్లలోని నీటిని శుద్ధి చేసే మెంబ్రేన్స్ పాడవుతున్నాయి. బాగా శుద్ధి చేసిన నీటిలో లీటర్‌కు 50 మిల్లీగ్రాముల టీడీఎస్ ఉంటుంది. ఈ నీటిని తాగితే నీళ్లు తాగినట్టు మనకు అనిపించదు. 100 నుంచి 600 మిల్లీగ్రాముల టీడీఎస్ ఉంటే తాగడానికి బాగుంటుందని నిపుణులు అంటుంటారు.
ఇంకేమైనా టెక్నాలజీలున్నాయా?
లో టెంపరేచర్ థర్మల్ డీసాలినేషన్ టెక్నిక్ ఒకటుంది. సముద్రంలో 0.3 కిలోమీటర్ల నుంచి 0.6 కిలోమీటర్ల లోతులో ఉండే నీరు పైనున్న నీటి కన్నా 4 నుంచి 8 డిగ్రీలు తక్కువ చల్లగా ఉంటుంది. ఈ నీటినే కొత్త టెక్నిక్‌కు వాడుకుంటారు. తొలుత పైనున్న సముద్ర ఉప్పు నీటిని ఓ ట్యాంకులో తీసుకుంటారు. దానిపై బాగా ఒత్తడి పెంచి వాటర్ వేపర్‌లా మార్చేస్తారు. ట్యూబ్‌లలో స్టోర్ చేస్తారు. సముద్రం నుంచి చల్లటి నీటిని సేకరించి ఈ ట్యూబ్‌ల నుంచి పంపుతారు. ఈ చల్లదనానికి వాటర్ వేపర్ నీళ్లలా మారుతుంది. చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ దీనిపై పని చేస్తోంది. లక్షద్వీప్‌లోని కవరత్తిలో లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్న ప్లాంట్‌ను 2005లో నిర్మించింది. 10 వేల మందికి దీని ద్వారా నీళ్లిస్తోంది. మినికాయ్, అగత్తిల్లోనూ ఇలాంటి ప్లాంట్లను నిర్మించాలనుకుంటున్నారు. అమిని, అండ్రోత్, చెట్లట్, కడమట్, కల్పెనీ, కిల్టన్ ద్వీపాల్లోనూ 1.5 లక్షల లీటర్ల కెపాసిటీ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
మరో కొత్త రకం ప్లాంట్లు?
చెన్నై తీరం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో 1 కోటి లీటర్ల (రోజుకు) సామర్థ్యమున్న ప్లాంట్‌ను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదో కొత్త రీసెర్చ్ ప్రాజెక్టు. ఇందులో ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్‌ను వాడుకుంటారు. ఎల్‌టీటీడీలో డీజిల్ పవర్‌ను వాడుకుంటే ఈ కొత్త ప్లాంటు డీసాలినేషన్ ప్రాసెస్‌లో వచ్చే నీటి ఆవిరిని వాడుకొని పవర్‌ను ఉత్పతి చేసుకుంటుంది. ఇప్పుడిది థీయరీనే. ప్రాక్టికల్‌గా జరగాల్సి ఉంది. ఇలాంటి ఓషన్ బేస్డ్ ప్లాంట్లకు సముద్రంలో 50 కిలోమీటర్ల లోతులో పైప్ లైన్ వేసి నీటిని అందించాలి. ఇలాంటి పైప్‌ను మేనేజ్ చేయడానికి గతంలోనే ఎన్‌ఐవోటీకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ప్రస్తుతానికైతే ఆర్వో టెక్నాలజీనే అద్భుతంగా నడుస్తోంది.
నడుస్తదని రుజువైంది.