- ఐదేండ్లలో 50 వేల మంది సీఏపీఎఫ్ జవాన్లు, అధికారులు రిజైన్చేశారు
- తెలంగాణ మాజీ సీఏపీఎఫ్ పర్సనల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు
బషీర్బాగ్, వెలుగు: కేంద్ర సాయుధ పోలీస్ దళాలు సీఏపీఎఫ్‌లోని సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్ బీకి చెందిన మాజీ అధికారులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ మాజీ సీఏపీఎఫ్ పర్సనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం కాకపోతే దేశ భద్రతపైనా ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆదివారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో సీఆర్పీఎఫ్ మాజీ డీజీ పురుషోత్తమరావు, సీఐఎస్ఎఫ్ మాజీ డీజీ డి.శ్యామల, అసోసియేషన్ అధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడారు.
13 ఏండ్లుగా న్యాయపోరాటం చేసి సుప్రీంకోర్టులో అనుకూల తీర్పులు వచ్చినప్పటికీ, వాటిని అమలు చేయకుండా పార్లమెంట్‌లో ప్రత్యామ్నాయ బిల్లులు తీసుకురావడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదన్నారు. కేడర్ నిర్వహణలో సమానత్వం విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కేంద్రం పట్టించుకోకపోవడం అన్యాయమని విమర్శించారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, పదోన్నతుల్లో ఉన్న స్థబ్ధతను తొలగించాలని, వృత్తిపరమైన అసమానతలను సరిచేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఆమోదం పొందిన ‘సీఏపీఎఫ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ బిల్లు-–2026’ను దళాలతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా తీసుకురావడం అధికార వికేంద్రీకరణ, కేడర్ హక్కులకు భంగం కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
దీర్ఘకాలిక ఫీల్డ్ పోస్టింగ్స్, సరైన కుటుంబ వసతి లేకపోవడం, అధిక ఆపరేషనల్ ఒత్తిడి మధ్య సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. ఐదేండ్లలో సుమారు 50 వేల మంది సీఏపీఎఫ్ జవాన్లు, అధికారులు ఉద్యోగాలకు రాజీనామా చేయడం ఆందోళనకరమన్నారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన సిబ్బందికి 'షహీద్' హోదా ఇవ్వాలని, ప్రస్తుతమున్న ‘ఆపరేషనల్ క్యాజువాల్టీ’ వర్గీకరణను పునఃసమీక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
