ఓవర్ స్పీడ్ తో ఆటోను ఢీకొట్టిన కారు..కారులో ప్రయాణిస్తున్న సైంటిస్ట్, తల్లి మృతి

ఓవర్ స్పీడ్ తో ఆటోను ఢీకొట్టిన కారు..కారులో ప్రయాణిస్తున్న సైంటిస్ట్, తల్లి మృతి

శంషాబాద్, వెలుగు :  ఓవర్ స్పీడ్ తో కారు.. ఆటోను ఢీకొట్టడంతో తల్లీకొడుకు చనిపోయిన ఘటన శంషాబాద్ రూరల్ పీఎస్  పరిధిలో జరిగింది. శంషాబాద్   రూరల్ ఇన్ స్పెక్టర్ శ్రీనాథ్  తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్  జిల్లా కాప్రాలోని ఈసీఐఎల్ ప్రాంతానికి చెందిన ఆదిశేషారెడ్డి (57) బాబా అటామిక్  రిసెర్చ్  సెంటర్ లో సైంటిఫిక్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు తన తల్లి రాములమ్మ (88) తో కలిసి హైదరాబాద్  నుంచి కారులో వెళ్తున్నారు. శంషాబాద్  పరిధి ఘాన్సిమియాగూడ వద్ద  రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్దకు చేరుకున్నారు. ఆ ప్రాంతంలో కొన్ని రోజులుగా జాతీయ రహదారి విస్తరణ పనులు కొనసాగుతున్నాయి.

అక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు. అతివేగంగా కారు నడుపుతున్న ఆదిశేషా రెడ్డి... ముందు వెళుతున్న ఆటోను ఢీకొట్టారు. కారు వేగం ధాటికి ఆటో.. పక్కనే వెళుతున్న బైక్ ను ఢీకొట్టింది. దీంతో కారు, ఆటో, బైక్  రోడ్డు పక్కన క్రాష్  బారియర్లు, సిమెంట్  దిమ్మెలను ఢీకొని జాతీయ రహదారి విస్తరణ కోసం తీసిన నీటి గుంతలో పడిపోయాయి. కల్వర్టులో నీరు ఉండడంతో బయటకు రాలేక కారులోనే ఆదిశేషారెడ్డి, ఆయన తల్లి చనిపోయారు.

ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు, బైక్‌‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే శంషాబాద్  రూరల్  పోలీసులకు, 108కి సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది.. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించింది. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.