బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి

బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి

కొడుకును ముఖ్యమంత్రి చేసేందుకే కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. యువతకు ఉపాధి అంటే.. కేసీఆర్ దృష్టిలో ఆయన కొడుకును సీఎం చేయడమేనని వ్యాఖ్యానించారు. ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ప్రధాన మోడీ ‘విజయ సంకల్ప సభ’లో ఆయన మాట్లాడారు.  కేసీఆర్ కు యువత, పేదల గురించి పట్టింపు లేదని.. రాత్రి, పగలు కొడుకును సీఎం చేయాలనే కలే ఆయనకు కనిపిస్తోందన్నారు.  అమిత్ షా ప్రసంగం వివరాలివీ.. ‘‘పరేడ్ గ్రౌండ్ లో కనుచూపు మేర బీజేపీ కార్యకర్తలే కనిపిస్తున్నారు. తెలంగాణ ప్రజల మూడు చూస్తే ఒకటి అర్థమవుతుంది. కేసీఆర్ ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తావో నిర్వహించు, తెలంగాణలో బీజేపీనే గెలుస్తుంది. పువ్వు గుర్తు ప్రభుత్వం వస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో నీళ్లు, నిధులు నియామకాలకోసం కొట్లాడారు. కానీ నీళ్లు, నిధులు, నియామకాలు లభించలేదు’’ అని తెలిపారు. ‘‘ కేసీఆర్ నా మాట శ్రద్ధగా వినండి.  వచ్చేసారి మీరు కాదు, మీ కుమారుడు కాదు, కచ్చితంగా బీజేపీనే అధికారంలోకి వస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ మొదటి నుంచి మద్దతిచ్చింది. 2014లో మోదీ అధికారంలోకి వస్తారని అనిపించగానే రాష్ట్రం ఏర్పాటు చేశారు.  కానీ అదీ సరిగ్గా చెయ్యలేదు. రెండు రాష్ట్రాలు కొట్లాడుకునేలా కాంగ్రెస్ చేసింది. దాన్ని వాడుకుని కేసీఆర్ గద్దెనెక్కారు’’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు.

మంత్రగాడి మాటలు విని సచివాలయానికి వెళ్లట్లేదు

‘‘ కేసీఆర్ పార్టీ గుర్తు కారు. కానీ దాని స్టీరింగ్ ఓవైసీ చేతుల్లో ఉంది. ఏ ప్రభుత్వ స్టీరింగ్ ఓవైసీ లాంటి వ్యక్తి చేతుల్లో ఉంటే ప్రజల సమస్యలను పరిష్కరించలేదు. తెలంగాణ ఉద్యమం సమయంలో హైదరాబాద్ విమోచన దినోత్సవం నిర్వహిస్తామన్నారు. ఎందుకు చేయలేదు కేసీఆర్? ఎందుకు చెయ్యలేడంటే ఓవైసీ అంటే కేసీఆర్ కు భయం’’ అని ఆయన కామెంట్ చేశారు. ‘‘మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యండి. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీజేపీ నిర్వహిస్తుంది. 8 ఏళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ సచివాలయానికి ఎందుకు వెళ్లరు? సచివాలయానికి వెళ్తే ప్రభుత్వం పడిపోతుందని మంత్రగాడు చెప్పాడు. అలాంటి నమ్మకాలున్న వ్యక్తి సీఎం గా కొనసాగకూడదు. ఇక ఇప్పుడు సచివాలయానికి వెళ్లేది బీజేపీ ముఖ్యమంత్రే’’ అని అమిత్ షా పేర్కొన్నారు.