
వర్షాకాలంలో ఎప్పుడూ లేనంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే... ఇది ఇన్ఫెక్షన్లు, జబ్బులను మోసుకొచ్చే కాలం. ఈ సీజన్లో జలుబు, స్కిన్ ఇన్ఫెక్షన్లతో పాటు చెవి, ముక్కు, గొంతు ఇన్ఫెక్షన్లు కూడా చాలా ఇబ్బంది పెడతాయి. చల్లని వాతావరణం, తేమ ఎక్కువ ఉండే ఈ కాలంలో కొంతమంది చెవినొప్పితో విలవిల్లాడిపోతుంటారు. ఈ సమస్యకు ఫంగల్ ఇన్ఫెక్షన్లు కారణం అంటున్నారు ఇఎన్‌టి స్పెషలిస్ట్ హేమంత్ కుమార్. ఈ సీజన్లో చెవుల్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఆయన చెప్తున్న జాగ్రత్తలివి...
శరీరంలోని సున్నితమైన అవయవాల్లో చెవి ఒకటి. అలాంటి చెవికి ఇన్ఫెక్షన్ సోకితే భరించలేనంత నొప్పి ఉంటుంది. ఈ సీజన్లో చెవి ఇన్ఫెక్షన్లు రావడానికి ప్రధాన కారణం... వర్షంలో బయటికి వెళ్లినప్పుడు చెవుల్లోకి నీళ్లు పోవడమే. అలాగే కొంతమందికి స్నానం చేసేటప్పుడు నీళ్లతో చెవుల్ని శుభ్రం చేసుకోవడం అలవాటు. ఇయర్ ప్లగ్స్ పెట్టుకోకుండా ఈతకొట్టడం వల్ల కూడా చెవిలోకి నీళ్లు పోతాయి. దాంతో చెవి లోపలి భాగం తడిగా ఉంటే తేమ పెరుగుతుంది. తేమ వాతావరణంలో క్యాండిడా వంటి ఫంగస్‌లు పెరిగి ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఈ ఇన్ఫెక్షన్లు బయటి చెవిలోనే ఎక్కువ. మధ్యచెవి, లోపలి చెవిలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం చాలా తక్కువ.
బ్యాక్టీరియాతో కూడా....
బ్యాక్టీరియా వల్ల కూడా చెవి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. అదెలాగంటే... ఈ సీజన్లో జలుబు, దగ్గు వంటివి ఎక్కువ. వీటికి తోడు చల్లగాలి, దుమ్ముధూళి, ఎలర్జీ వంటివి స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా, హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా బ్యాక్టీరియాలు పెరిగేందుకు సాయపడతాయి. ముక్కు నుంచి ‘యూస్టాచియన్ ట్యూబ్’ ద్వారా చెవిలోకి కనెక్షన్ ఉంటుంది. ఈ బ్యాక్టీరియాలు ముక్కు నుంచి ఈ ట్యూబ్ ద్వారా చెవిలోకి వెళ్లి మధ్య చెవి ఇన్ఫెక్షన్కి కారణమవుతాయి. దీంతో చెవి నుంచి చీము కారుతుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువ ఉంటే వినికిడి శక్తి తగ్గిపోయే ప్రమాదం ఉంది.
చెవి మూసుకుపోయి...
ఈ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన లక్షణాలని ముందే గుర్తించడం మంచిది. ఇన్ఫెక్షన్ లక్షణాలు ఇలా ఉంటాయి... చెవి బాగా నొప్పి పెడుతుంది. చెవి మూసుకుపోయినట్టు అనిపిస్తుంది. చెవి వాపు, ఎర్రగా మారడం, తలనొప్పితో పాటు ఇన్ఫెక్షన్ తీవ్రతని బట్టి జ్వరం కూడా రావచ్చు. కొందరిలో చెవి నుంచి నల్లని ద్రవం బయటకు వస్తుంటుంది. దీన్ని ‘ఫంగల్ డెబ్రీ’ అంటారు. ఇవి ఫంగల్ స్పోర్స్. ఫంగస్‌ని బట్టి ఈ స్పోర్స్ నలుపు, తెలుపు రంగులో ఉంటాయి. రెండు రోజుల తర్వాత కూడా నొప్పి తగ్గకపోయినా, నొప్పి మరింత ఎక్కువైనా వెంటనే ఇఎన్‌టి డాక్టర్ని కలవాలి.
చెవి శుభ్రం చేశాక..
ట్రీట్మెంట్ మొదలుపెట్టే ముందు... చెవిలో టార్చ్ లైట్ వేసి చూస్తే ఇన్ఫెక్షన్ కనిపిస్తుంది. మెడిసిన్స్ కంటే ముందుగా చెవిని శుభ్రం చేయాలి. తర్వాత యాంటీ ఫంగల్ డ్రాప్స్, మందులు వాడితే రిజల్ట్ ఉంటుంది. నాలుగు నుంచి వారం రోజుల్లో ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది.
ఈ జాగ్రత్తలు ముఖ్యం
ఎప్పుడూ చెవుల్ని పొడిగా ఉంచుకోవాలి. వర్షంలో బయటికి వెళ్తే చెవిలోకి నీళ్లు వెళ్లకుండా చూసుకోవాలి. స్నానం చేసేటప్పుడు వాజిలైన్ రాసిన దూదిని చెవిలో పెట్టుకోవాలి. వాజిలెన్ అనేది వాటర్ రెపల్లెంట్గా పనిచేసి చెవిలోకి నీళ్లు వెళ్లకుండా అడ్డుకుంటుంది. అలాగే... చెవి నొప్పి మొదలుకాగానే మెడికల్ షాప్‌లో ఇయర్ డ్రాప్స్ తెచ్చుకుని వాడుతుంటారు చాలామంది. కొన్నిరకాల డ్రాప్స్ వల్ల చెవి దెబ్బతిని వినికిడి లోపం వచ్చే అవకాశం ఉంది. అందుకని డాక్టర్ని కన్సల్ట్ చేసిన తరువాతే ఇయర్ డ్రాప్స్ వాడాలి. ఇమ్యూనిటీ తక్కువ ఉండే పెద్దవాళ్లు, చిన్న పిల్లలు, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకున్నవాళ్లు ఎలర్జీల బారిన పడకుండా చూసుకోవడమే కాకుండా ఇమ్యూనిటీ పెంచే ఫుడ్ తినాలి. డయాబెటిస్ ఉంటే కంట్రోల్లో పెట్టుకోవాలి. రోజూ ఎక్సర్సైజ్ చేయాలి.
- డాక్టర్.బి. హేమంత్ కుమార్
సీనియర్ కన్సల్టెంట్ ఇఎన్‌టి మరియు హెడ్ & నెక్ సర్జరీ
రెనోవా హాస్పిటల్స్, హైదరాబాద్.