సమ్మిళిత రవాణా వ్యవస్థ కావాలి

సమ్మిళిత రవాణా వ్యవస్థ కావాలి

మానవ చర్యల వల్ల గాలి కాలుష్యం పెరుగుతున్నది. ఇది అంతటా ఉన్నా, పట్టణ ప్రాంతాల్లో, హైదరాబాద్​లాంటి పెద్ద నగరాల్లో ఇంకా బాగా కనిపిస్తున్నది. ఒకప్పుడు పారిశ్రామిక ప్రాంతాలకే పరిమితమైన కాలుష్యం, ఇప్పుడు అంతటా పాకిపోయింది. కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాల కంటే, సాంకేతిక విరుగుడుతోనే సమస్య పరిష్కారం అవుతుందని అటు రాజకీయ నాయకులు, ఇటు అధికారులు ప్రజలకు ఓ భ్రమ కల్పిస్తున్నారు. హైదరాబాద్ సిటీలో వాయు కాలుష్యం తగ్గించడానికి  కేంద్ర ప్రభుత్వం 2020 నవంబర్​లో రూ.117 కోట్లు విడుదల చేసింది. వాటిని తెలంగాణ ప్రభుత్వం వాయు కాలుష్యం ఎంత ఉందో చెప్పే సాధనాల మీద ఖర్చు పెట్టింది. కానీ కాలుష్యాన్ని తగ్గించే చర్యలు, ఆలోచనల కోసం వెచ్చించలేదు. నగర ప్రజలు నిరంతరం జలుబు, దగ్గు తదితర వ్యాధులతో ఇబ్బంది పడటానికి గాలిలో ఉన్న దుమ్ము, ధూళితో పాటు వాహనాల నుంచి వెలువడే ప్రమాదకర వాయువులే కారణం. ఈ మధ్య క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా సాధారణమైపోతున్నాయి. దానికి గల కారణం మనం ఆక్సీజన్​తోపాటు ఇతర క్యాన్సర్ కారక వాయువులను పీల్చడమే. 

పరిష్కార మార్గాలు

రవాణా రంగం వల్ల ఏర్పడుతున్న వాయు కాలుష్యం తగ్గించాలంటే వాహనాల ఇంధనంలో మార్పులు తీసుకు రావాలి. విద్యుత్ ​వాహనాల వాడకం పెంచాలి. డీజిల్, పెట్రోల్ ఇంధనం గాకుండా ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం పెరగాలి. వ్యక్తిగత వాహనాలను తగ్గించి ప్రజా రవాణా వ్యవస్థను పెంచాలి. హైదరాబాద్ నగరంలో వర్షపు నీటితో కలిసిన దుమ్మూ, ధూళి, సీసం తదితర కలుషితాల వల్ల భూగర్భ జలాల్లో సీసం లాంటి అవశేషాలు పెరుగుతున్నట్లు పరిశోధనల్లో తేలింది. వాటిని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి. బొగ్గు, డీజిల్, పెట్రోల్ ఇతర ఇంధనాలను కాల్చడాన్ని తగ్గించుకునే లక్ష్యాలు ఏర్పరచుకోవాలి. థర్మల్ విద్యుత్ కేంద్రాలను మూసివేయాలి. ప్రజలు కూడా కాలుష్య రహిత జీవన విధానం అవలంబించుకోవాలి. పర్యావరణహిత ప్రభుత్వ విధానాల కోసం పోరాడాలి.

సిటీలో మెట్రో వచ్చినా..

హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు ఏర్పాటు కాలుష్య కారక వాహనాలను తగ్గిస్తుందని ఆశించినా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. టికెట్ ధర ఎక్కువ ఉండటం వల్ల తక్కువ మంది అందులో ప్రయాణిస్తున్నరు. సొంత వాహనం ఉన్నవాళ్లు తమ వాహనం వదిలిపెట్టి మెట్రో రైలును ఆశ్రయించే పరిస్థితి లేదు. ఏ వాహనం కొనలేని పేదలకు మెట్రో రైలు ఎక్కే శక్తి లేదనే చెప్పాలి. సమ్మిళిత రవాణా వ్యవస్థ లేని పరిస్థితుల్లో, మెట్రో రైలు మార్గం ఇతర రవాణా వ్యవస్థలతో అనుసంధానం కాలేదు. ఫలితంగా రూ.15,000 కోట్ల పెట్టుబడితో ఉపయోగం లేకపోగా, నగర ప్రధాన మార్గంలో మెట్రో నిర్మాణం వల్ల ట్రాఫిక్ జటిలమై కాలుష్యం ఇంకా పెరుగుతున్నది.

సమ్మిళిత రవాణా వ్యవస్థ కావాలి

ఎలక్ట్రిక్ వాహనా(ఈవీ)లు ఇటీవల ప్రాచుర్యంలోకి వచ్చాయి. వీటి వల్ల గాలి, ధ్వని కాలుష్యాలు తగ్గుతాయి. కాకపోతే ఈవీలను ప్రజలు అందుకోవడంలో అనేక సమస్యలున్నాయి. వాటి ధర ఎక్కువగా ఉండటం, బ్యాటరీ చార్జింగ్ సౌకర్యాలు కూడా మెరుగుపడకపోవడం లాంటి సమస్యలు ఉన్నాయి. ఇటీవల, తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక విధానం ప్రకటించినా అందులో అనేక లోపాలు ఉన్నాయి. ప్రజలతో సంప్రదింపులు జరిపి ఈ విధానం తయారు చేసి ఉంటే బాగుండేది. ఎంఎంటీఎస్​ వ్యవస్థను విస్తృతపరిస్తే తక్కువ ఖర్చుతో నగర ప్రజలకు ఒక మంచి రవాణా సౌకర్యం ఏర్పడుతుంది. సమ్మిళిత రవాణా వ్యవస్థ అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి.  

నడకను, పాదచారులను ప్రోత్సహించాలంటే, మౌలిక వసతుల డిజైన్ లో మార్పులు రావాలి. తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ ఆలోచన చేయడం మాట అటుంచి, దేశంలోనే ఆదర్శంగా ఉన్న ఆర్టీసీ వ్యవస్థను నాశనం చేస్తూ, ప్రజా రవాణా వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నది. రహదారుల వెడల్పు, ఫ్లై ఓవర్ల నిర్మాణం పరిష్కారంగా భావిస్తూ, వేల కోట్లు అప్పులు తెచ్చి ఎస్‌ఆర్‌డీపీ పేరు మీద పెట్టుబడి పెడుతున్నది. రహదారులు వెడల్పు తాత్కాలిక ఉపశమనం కల్పించవచ్చు గానీ దీర్ఘకాలికంగా మంచిది కాదని ప్రపంచ వ్యాప్త అనుభవం చెబుతున్నది. కేవలం ధనికులకు, కార్లు ఉన్నవాళ్లకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వ పెట్టుబడుల వినియోగం ఉంది. అక్కరకు రాని నిర్మాణాల వల్ల అప్పుల పాలై, అవసరమైన పెట్టుబడులు పెట్టలేని దుస్థితిలో హైదరాబాద్ నగర మున్సిపల్ సంస్థలు ఉన్నాయి. ఇటీవల, తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖ విడుదల చేసిన వార్షిక నివేదికల్లో వాహనాలు, పట్టణ కాలుష్యం గురించిన ప్రస్తావన లేదు. ఇది ప్రభుత్వ ప్రణాళికల్లో, పాలనలో ఉన్న అనేక లోపాలకు ప్రత్యక్ష ఉదాహరణ.

దుష్ప్రభావాలు

వాహనాల వల్ల కలిగే వాయు కాలుష్యం అనారోగ్య పరిస్థితులకే గాక, సామాజిక, ఆర్థిక వ్యవస్థల మీద దుష్ప్రభావం చూపుతుంది. పర్యావరణంలో విపరీత పరిణామాలకు దారి తీస్తుంది. వేడి పెరుగుతుంది. ఇతర కారణాల వల్ల వచ్చే తాపం దీనికి తోడై జీవన పరిస్థితులు దుర్భరం అవుతాయి. గాలిలో ప్రాణవాయువు పరిమాణం తగ్గిపోతున్నది. కాలుష్యాన్ని ఇముడ్చుకునే శక్తి కూడా ప్రకృతిలో తగ్గిపోతున్నది. అటువంటి శక్తి తగ్గినా కొద్దీ, మున్ముందు అగ్గిపుల్ల కాల్చినా తట్టుకోలేని కాలుష్య భారం ఏర్పడే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే పక్షులు ఇతర జీవాలు ప్రమాదంలో పడ్డాయి. కొన్ని జాతులు అంతరించిపోయాయి కూడా. మానవాళి అనారోగ్యం పాలు అవుతున్నది. చిన్న పిల్లలకు అంతుపట్టని వ్యాధులు సంక్రమిస్తున్నాయి. సహజ రోగనిరోధక శక్తి తగ్గిపోతున్నది. తక్షణ నివారణ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్ లో ఊహించని ముప్పు తప్పదు.

వాహనాల సంఖ్య పెరగడం

వాహనాలు ఎక్కువవుతుండటంతోనే గాలిలో విష వాయువుల పరిమాణం పెరుగుతున్నది. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 2005లో ప్రతి1000 మందికి 278 వాహనాలు ఉంటే, 2016 నాటికి వాటి సంఖ్య 660కి చేరినట్లు ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ అండ్‌ ట్రైనింగ్‌ రీసెర్చ్‌ ఇన్​స్టిట్యూట్​(ఈపీటీఆర్‌ఐ) గణాంకాలు చెబుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 2014 మార్చి నాటికి 21.75 లక్షల వాహనాలుండగా, ఆ సంఖ్య 2018 మార్చి నాటికి 29.09 లక్షలకు చేరింది. ఇందులో బైకులే అధికం. 2014లో 15.89 లక్షల బైకులు ఉండగా, ఆ సంఖ్య 2018 నాటికి 21.35 లక్షలకు చేరింది.  

గ్రేటర్‌వ్యాప్తంగా తీసుకుంటే అధికారిక గణాంకాల ప్రకారమే 50 లక్షల మార్కు దాటాయి. ఇతర జిల్లాల వాహనాలను కలుపుకుంటే ఆ సంఖ్య 60 నుంచి 70 లక్షల వరకు ఉంటుందని అంచనా. 2017లో ఓ ఎమ్మెల్యే ప్రశ్నకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ప్రకారం.. హైదరాబాద్ సిటీలో 10,14,431 నాలుగు చక్రాల వాహనాలు, 40,14,034  బైకులు ఉన్నాయి. గాలిలో ధూళి కణాలు పరిమితికి మించి నమోదవుతున్నాయి. గత 20 ఏండ్లలో సిటీలో వీటి తీవ్రత 5 రెట్లు పెరిగింది. ఇందుకు వాహనాల పెరుగుదలే ప్రధాన కారణమని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తేల్చింది. కార్బన్‌ డయాక్సైడ్‌, మీథేన్‌, ఓజోన్‌, క్లోరో ఫ్లోరో కార్బన్లు తదితరాలు ఉండే హరిత వాయువుల విషయానికొస్తే, మొత్తం పరిమాణంలో 57 శాతం వాహనాల నుంచే వెలువడుతున్నాయి. కార్బన్‌ మోనాక్సైడ్‌, నైట్రోజన్‌ ఆక్సైడ్లు తదితర కాలుష్య ఉద్గారాల తీవ్రత గతంతో పోలిస్తే బాగా పెరిగింది. 2025 నాటికి నగరంలో వాహన రద్దీ ఇప్పుడున్న దాని కంటే మరో 69 శాతం పెరుగుతుందని సీపీసీబీ అధ్యయనం చెబుతున్నది. 

- దొంతి నర్సింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్