టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. వాహనరంగంలోనూ చాలా మార్పులు వస్తున్నాయి. తాజాగా దుబాయ్ లో గాల్లో ఎగిరే కార్లు టెస్టింగ్ డ్రైవింగ్ పూర్తి చేసుకుని.. అందర్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇప్పటికే ఎగిరే కార్లను తయారు చేసేందుకు కొన్ని దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. చైనీస్ ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ ఎక్స్‌పెంగ్(Xpeng) తయారు చేసిన ఎగిరే కారును యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఎగురవేశారు.
ప్రపంచంలోనే ఫస్ట్ టైమ్ ఫ్లయింగ్ ఎలక్ట్రిక్ టాక్సీని పరీక్షించారు. ఇది చూసిన దుబాయ్ నగరవాసులు ఆశ్చర్యపోయారు. ఎక్స్‌పెంగ్ కంపెనీ అంతర్జాతీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ప్రారంభించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే తమ తొలి ఫ్లయింగ్ కారును పరీక్షిస్తూ ఆకాశంలో 90 నిమిషాల పాటు ఎగురవేసింది.
ఖలీజ్ టైమ్స్ నివేదించిన ప్రకారం.. ఎగిరే కారు రెండు-సీట్ల సామర్థ్యం కలిగి ఉంటుంది. దాదాపు 760 కిలోల వరకు అది గాలిలో ఎగురుతుంది. దీన్ని ప్రీమియం కార్బన్ ఫైబర్‌తో తయారు చేశారు. ఇందులో ఎయిర్‌ఫ్రేమ్ పారాచూట్ కూడా ఉంది. కారులో ఒకేసారి ఇద్దరు ప్రయాణికులు ప్రయాణించవచ్చు.
2025 నాటికి ఎగిరే కార్లలో సామాన్య ప్రజలు కూడా ప్రయాణించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎగిరే కార్లలో చేసే ప్రయాణాలు చాలా ఖర్చుతో కూడుకుని ఉండొచ్చు. ఎక్స్‌పెంగ్ అభివృద్ధి చేసిన ఈ ఎగిరే కారుకు ఎక్స్-2 అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఎగిరే కార్లు తప్పకుండా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
