కందనూలు, వెలుగు: ప్రొటోకాల్ ఉల్లంఘించారన్న కారణంతో నాగర్కర్నూల్మాజీ ఎమ్మెల్యే, ఎంజేఆర్ ట్రస్ట్ చైర్మన్ మర్రి జనార్దన్ రెడ్డిపై కేసు నమోదైంది. మర్రి జనార్దన్‌రెడ్డి తన ఎంజేఆర్ట్రస్ట్ద్వారా రూ.50 లక్షలతో నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం సిరసవాడ జడ్పీహెచ్ ఎస్ బిల్డింగ్ నిర్మాణానికి 2022లో శంకుస్థాపన చేశారు. బిల్డింగ్ పూర్తికావడంతో ఆదివారం ప్రారంభత్సవానికి రెడీ చేశారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి తన అనుచరులతో వచ్చి స్కూల్గేట్ వద్ద ఏర్పాటు చేసిన రిబ్బన్‌కట్ చేసి, గతంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ప్రారంభించి వెళ్లిపోయారు.
అనంతరం ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి స్కూల్ వద్దకు రాగా అప్పటికే స్కూల్ ను మాజీ ఎమ్మెల్యే ప్రారంభించినట్లు గుర్తించారు. దీంతో డీఈవో గోవిందరాజులు, హెచ్ఎంను పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి రెండు వేర్వేరు శిలాఫలకాలు ఏర్పాటు చేశారని తెలుసుకోని అసహనం వ్యక్తం చేశారు. అనంతరం స్కూల్ ను ప్రారంభించకుండానే ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రోటోకాల్ ఉల్లంఘించి డ్యూటీకి ఆటంకం కలిగించారని హెచ్ఎం చాంద్ పాషా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు.
