
ఇందల్వాయి, వెలుగు: దేవుడికి కొబ్బరికాయ కొట్టే విషయంలో రెండు కులస్తుల మధ్య గొడవ జరగగా.. 30 మందిపై కేసు నమోదైంది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారంలో జరిగింది. ఎస్సై గౌరీందర్‌గౌడ్‌వివరాల ప్రకారం.. ఈ నెల 27వ తేదీన గ్రామంలో బీరప్ప పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా దేవుడికి ముందుగా కొబ్బరికాయ కొట్టే విషయంలో గొల్ల, కురుమ కులస్తుల మధ్య గొడవ జరిగింది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని రెండు వర్గాలను సముదాయించారు. అదేరోజు సాయంత్రం మరోసారి ఘర్షణకు దిగడంతో పోలీసులు 30 మందిపై కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఎస్సై మంగళవారం మీడియాకు వెల్లడించారు.