యాదాద్రి ఈవో ఫిర్యాదు .. హరీశ్ రావుపై కేసు

యాదాద్రి  ఈవో ఫిర్యాదు .. హరీశ్ రావుపై కేసు
  • ఎమ్మెల్సీ దేశపతి, మాజీ ఎమ్మెల్యే సునీతపై కూడా 
  • రూల్స్​కు విరుద్ధంగా యాదాద్రిలో పూజలు చేశారని ఈవో ఫిర్యాదు

యాదాద్రి/యాదగిరిగుట్ట, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతపై కేసులు నమోదయ్యాయి. వీళ్లు గురువారం యాదగిరిగుట్టలో టెంపుల్​రూల్స్​కు విరుద్ధంగా బయటి నుంచి తీసుకొచ్చిన పూజారులతో ‘పాప ప్రక్షాళన’ పేరుతో పూజలు నిర్వహించారు. దీంతో రూల్స్​ బ్రేక్ ​చేశారని టెంపుల్ ఈవో భాస్కర్ యాదగిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బీఆర్ఎస్ నేతలతో పాటు పూజారులపై కేసులు నమోదయ్యాయి. 

అనుమతి లేకుండా టెంపుల్​లో పూజలు చేశారని, ఆలయ నిబంధనలు ఉల్లంఘించి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా రాజకీయ పూజలు చేశారని ఈవో ఫిర్యాదు చేశారు. కాగా, రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పి పాపం చేశారని విమర్శిస్తూ.. యాదగిరిగుట్ట ఆలయంలో బీఆర్ఎస్ నేతలు పాప ప్రక్షాళన పేరుతో పూజలు నిర్వహించారు. తమ వెంట తీసుకొచ్చిన పూజారులతో (టెంపుల్ వాళ్లు కాదు) కొండపై ప్రధానాలయ తూర్పు రాజగోపురం ఎదుట పూజ చేశారు. రుణమాఫీ పేరుతో సీఎం అన్ని అబద్ధాలు చెప్పారని మంత్రాల రూపంలో పూజారీ చదివారు. ‘యాదగిరి లక్ష్మీనర్సింహ ఈ ముఖ్యమంత్రి చేసిన పాపం క్షమించు’ అంటూ బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు.  

ఎమ్మెల్యే అయిలయ్యపై బీఆర్ఎస్​ ఫిర్యాదు.. 

బీఆర్ఎస్ నేతలు వెళ్లిన తర్వాత ఆలయ పరిసరాలను కాంగ్రెస్ నేతలతో కలిసి ప్రభత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య శుద్ధి చేశారు. టెంపుల్​ రూల్స్​ బ్రేక్​ చేసి పరిసరాలను శుద్ధి చేసిన ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యతో పాటు కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేత గొంగిడి మహేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.