నిర్మల్ జిల్లాలో సీఎంఆర్​పై ఉక్కుపాదం

నిర్మల్ జిల్లాలో సీఎంఆర్​పై ఉక్కుపాదం
  •     గడువు ముగియడంతో రంగంలోకి ఆఫీసర్లు
  •     రైస్ మిల్లుల్లో తనిఖీలు షురూ..
  •     నిర్మల్​లో ఓ మిల్లు సీజ్..ఓనర్​పై క్రిమినల్ కేసు

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో సీఎంఆర్ రికవరీ వ్యవహారం ముదురుతోంది. జిల్లాలోని 48 రైస్ మిల్లుల యాజమాన్యాలు సీఎంఆర్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్న ఫిర్యాదులు వెల్లువెత్తడంతో స్వయంగా కలెక్టర్ రైస్ మిల్లులను తనిఖీ చేసి సీఎంఆర్ బియ్యాన్ని గడువులోగా అప్పజెప్పాలని కొద్దిరోజుల క్రితం ఆదేశించారు. అయినప్పటికీ రైస్ మిల్లుల యాజమాన్యాలు కలెక్టర్ హెచ్చరికలను పట్టించుకోకుండా.. సీఎంఆర్ రికవరీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు అవకతవకలు జరిగిన రైస్ ​మిల్లులను సీజ్​ చేస్తున్నారు.

మారని మిల్లుల యాజమాన్యాల వైఖరి

2022–23 రబీ సీజన్​కు సంబంధించిన సీఎంఆర్ బియ్యం విషయంలో ప్రభుత్వం జనవరి 31 వరకు గడువు విధించింది. టార్గెట్​గడుపులోగా సీఎంఆర్ అప్పజెప్పని రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. దీనికి అనుగుణంగానే కలెక్టర్ కూడా సంబంధిత అధికారులు, రైస్ మిల్లు యాజమాన్యాలతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు జారీ చేశారు. అయినప్పటికీ రైస్ మిల్లు యాజమాన్యాలు నిర్లక్ష్యాన్ని వీడలేదు. దీంతో అధికారులు రంగంలోకి దిగి రైస్ మిల్లుల తనిఖీలకు శ్రీకారం చుట్టారు.

శనివారం జిల్లాలోని  సారంగాపూర్ మండలం చించోలి బి గ్రామంలోని శ్రీ సాయి రైస్ మిల్లును తనిఖీ చేసిన అధికారులు.. మిల్లులో అవకతవకలు జరిగినట్లు గుర్తించి సీజ్ చేశారు. అలాగే సంబంధిత మిల్లు యజమానిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మిల్లులో దాదాపు 290 క్వింటాళ్ల బియ్యం లెక్కలు తేలలేదని, సీఎంఆర్ కు సంబంధించిన ధాన్యాన్ని ఆరు బయట నిల్వచేసి నిర్లక్ష్యంగా వ్యవహరించారని అధికారులు తెలిపారు. 
 
పెండింగ్​లో లక్షా 3 వేల 716 ఎంటీఎస్​లు

2022–23 రబీ సీజన్​కు సంబంధించి మొత్తం లక్షా 58 వేల 56.320 ఎంటీఎస్​ల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. అయితే ఇందులో నుంచి లక్షా 6 వేల 831 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని మిల్లుల యాజమాన్యాలు ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంది. కానీ ఏడాది గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు కేవలం 3 వేల116 టన్నుల బియ్యాన్ని మాత్రమే ప్రభుత్వానికి అప్పజెప్పాయి.

ఇంకా లక్షా 3 వేల 716 ఎంటీఎస్​ల సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి ముట్టజెప్పాల్సి ఉంది. దీనిపై పలుమార్లు ప్రభుత్వం గడువు పెంచినప్పటికీ.. ఆ డెడ్​లైన్​లోగా రైస్ మిల్లు యాజమాన్యాలు సీఎంఆర్ ను తిరిగి అప్పజెప్పలేదు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు రైస్ మిల్లుల్లో తనిఖీలు చేపట్టి కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతు న్నారు. సోమవారం నుంచి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేయనున్నారు.

బీఆర్ఎస్  ప్రభుత్వ హయాం నుంచే..

 గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ నేతల అండదండలతో కొంత మంది రైస్ మిల్లు యజమానులు సిండికేట్​గా ఏర్పడి సీఎంఆర్ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.

రాజకీయ పలుకుబడితో కొంతమంది రైస్ మిల్లుల యాజమాన్యాలు సంబంధిత శాఖ అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి సీఎంఆర్ ధాన్యాన్ని ఇష్టానుసారంగా అమ్ముకున్నారన్న ఫిర్యాదులున్నాయి. అప్పటి ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి ధాన్యం స్టాకుల్లో గందరగోళం సృష్టించి తప్పుడు లెక్కలతో అధికారులను సైతం తప్పుదోవ పట్టించారన్న ఆరోపణలున్నాయి. రైస్ మిల్లర్ల ఒత్తిడి కారణంగా అధికారులు చర్యలకు వెనకాడడంతో వారి అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండాపోంది.