కర్నాటకలో బీజేపీపై కేసు నమోదు.. సీఎం, డిప్యూటీ సీఎంలు ‘స్కామ్ లార్డ్’ అంటూ పోస్ట్

కర్నాటకలో బీజేపీపై కేసు నమోదు.. సీఎం, డిప్యూటీ సీఎంలు ‘స్కామ్ లార్డ్’ అంటూ పోస్ట్

బెంగళూరు: సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్నాటక కాంగ్రెస్​ప్రభుత్వంపై అవమానకరమైన కంటెంట్‌‌ను పోస్ట్​చేసిన బీజేపీపై సైబర్​ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్​తో పాటు పలువురు మంత్రుల ఫొటోలను పోస్ట్ చేసి, దానికి ‘‘స్కామ్ లార్డ్’’ అనే శీర్షిక పెట్టి.. ‘‘పగలు రాత్రి కర్నాటకను దోచుకుంటున్న @INCKarnataka ప్రభుత్వ స్కామ్ సామ్రాజ్యం అసలు కథ ఇది!!" అని బీజేపీ నేతలు పోస్ట్‌‌ చేశారు. 

ఈ పోస్ట్‎పై కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేసింది. బీజేపీ నేతలు తమ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని, సమాజంలో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. కర్నాటక ప్రభుత్వంపై బీజేపీ చాలా కాలంగా అవినీతి ఆరోపణలు చేస్తోంది. గత నెలలో, జస్టిస్ వీరప్ప కర్నాటకలో 63 శాతం అవినీతి ఉందని చేసిన వాదనను గుర్తుచేస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్ర ఎన్నికలకైనా నిధులు సమకూర్చుకోవడానికి కర్నాటక ఒక ‘‘ఏటీఎం’’గా మారిందని సిద్ధరామయ్య ప్రభుత్వంపై ఆ పార్టీ విమర్శలు గుప్పించింది.