టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లిపై కేసు నమోదు

టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లిపై కేసు నమోదు

సికింద్రాబాద్: బీజేపీ నేతల హెచ్చరికలతో పోలీసు అధికారులు స్పందించారు. మల్కాజ్ గిరి జీహెచ్ఎంసీ కార్యాలయంలో పంద్రాగస్టు వేడుకల సందర్భంగా బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ పై బీర్ బాటిళ్లతో దాడి చేసి గాయపరచిన ఘటన మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో పోలీసులు స్పందించి ఐపీసీ సెక్షన్స్ 307, 323,324,143,147,149 కింద కేసులు నమోదు చేశారు. మల్కాజిగిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తోపాటు మరో 15 మంది కార్యకర్తల పై కేసులు నమోదు చేశారు. వేడుకలను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా పై కూడా దాడి చేసి కెమెరాలు, ఫోన్లు లాక్కుని పరారైన ఘటనపై బీజేపీ నేతలు తీవ్రంగా పరిగణించారు.

వెంటనే స్పందించి మల్కాజ్ గిరి గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ ను పరామర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు  బండి సంజయ్ , మాజీ ఎంపీ విజయశాంతి, మాజీమంత్రి విజయరామరావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు,  మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్సెస్ ప్రభాకర్ తదితరులు కార్పొరేటర్ శ్రవణ్ ను పరామర్శించిన సందర్భంగా దాడి ఘటనకు సంబంధించిన వీడియోలు చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కేసు నమోదు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించిన నేపధ్యంలో పోలీసులు స్పందించారు. 

దాడికి నిరసనగా రేపు బంద్
బీజేపీ కార్పొరేటర్ పై దాడికి నిరసనగా రేపు బంద్ పాటించాలని బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశాల మేరకు రేపు బంద్ పాటించాలని మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు ప్రకటించారు. ప్రతి ఒక్కరు శ్రవణ్ పై దాడికి నిరసనగా బంద్ లో పాల్గొనాలని రామచందర్ రావు పిలుపునిచ్చారు.