'బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ 2025".. యూత్‌కి సీఎం రేవంత్ రెడ్డి గోల్డెన్ ఛాన్స్!

'బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ 2025"..  యూత్‌కి  సీఎం రేవంత్ రెడ్డి గోల్డెన్ ఛాన్స్!

తెలంగాణ ప్రభుత్వం,  ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) సంయుక్తంగా యువ ఫిల్మ్ మేకర్స్‌కు ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. 'బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ 2025' పేరుతో షార్ట్ ఫిల్మ్స్, వీడియో సాంగ్స్ పోటీలను నిర్వహిస్తోంది. ఈ పోటీలలో విజేతలకు లక్షల రూపాయల నగదు బహుమతులను అందించనుంది.  అంతే కాదు తర్వాత ప్రభుత్వ పరంగా నిర్మించే వివిధ చిత్రాలలో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ..  పనిచేసే అవకాశం కూడా కల్పించనున్నట్లు తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్  దిల్ రాజు తెలిపారు. ఈ పోటీ తెలంగాణ‌లోని యువ సృజ‌న‌శీలుర‌కు ప‌ట్టం క‌ట్టేందుకు ఇది ఎంతో దోహదపడుతుందన్నారు.

బతుకమ్మ ఛాలెంజ్ 2025: బహుమతుల వివరాలు

ప్రథమ బహుమతి: రూ. 3,00,000/-

ద్వితీయ బహుమతి: రూ. 2,00,000/-

తృతీయ బహుమతి: రూ. 1,00,000/-

కన్సోలేషన్ బహుమతి: రూ. 20,000/- (ఐదుగురికి)

పోటీకి అర్హతలు, నిబంధనలు

ఈ పోటీలో పాల్గొనడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి.  పాల్గొనేవారు 40 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండాలి. షార్ట్ ఫిల్మ్‌లు లేదా పాటలు 4K రిజల్యూషన్‌లో తీసి ఉండాలి. ఎంట్రీలు ఇంతకు ముందు ఎక్కడా ప్రదర్శించబడనివై, కేవలం ఈ పోటీ కోసమే ప్రత్యేకంగా రూపొందించినవై ఉండాలి. అంతే కాదు షార్ట్ ఫిల్మ్ వ్యవధి 3 నిమిషాలకు మించి ఉండకూడదు. పాటల వ్యవధి 5 నిమిషాలకు మించి ఉండకూడదని నిర్ణయించింది..

పోటీ థీమ్స్ - మీ సృజనకు ఒక వేదిక

యూత్ ఫిల్మ్ మేకర్స్ తమ క్రియేటివిటీని ఈ రెండు థీమ్స్‌లో ఏదైనా ఒకదానిపై చూపించవచ్చు..

 తెలంగాణలో ప్రజా పాలన:  తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలోని ' ప్రజా పాలన' ప్రారంభమైన నాటి నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలపైన  కథా చిత్రాలు రూపొందించవచ్చు . ఉదాహరణకు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహాలక్ష్మి పథకం, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, క్రీడా విశ్వవిద్యాలయం, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ వంటి అంశాలపై ఆసక్తికరమైన కథనాలు లేదా పాటలు తీయవచ్చు.

తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పండుగలు, కళారూపాలు: తెలంగాణ అపురూపమైన చరిత్ర, గొప్ప సంస్కృతి, పండుగలు, కళా రూపాలను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఫిల్మ్స్ లేదా పాటలు తయారు చేయవచ్చు. ఈ థీమ్ తెలంగాణ కళాకారులకు, సాంస్కృతిక ప్రేమికులకు ఒక గొప్ప అవకాశం.

ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీ

నియమిత గుడువులోగా అందిన ఎంట్రీలను పరిశీలించి, నిపుణులతో కూడిన జ్యూరీ బృందం విజేతలను ఎంపిక చేస్తుంది. విజేతలుగా ఎంపికైన వారికి నగదు బహుమతులతో పాటు శాలువా, ప్రశంసా పత్రం, మెమెంటోలు అందజేస్తారు. ఇంకా, ఈ పోటీలో గెలిచిన యువ ప్రతిభావంతులకు భవిష్యత్తులో ప్రభుత్వం నిర్మించే చిత్రాలలో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రకటించింది. ఇది కొత్తగా ఫిల్మ్ మేకింగ్‌లోకి అడుగుపెట్టేవారికి ఒక గొప్ప వేదిక.

మీ ఎంట్రీలను పంపించడానికి ఆఖరి తేదీ సెప్టెంబర్ 30, 2025. ఆసక్తి ఉన్నవారు తమ ఎంట్రీలను youngfilmmakerschallenge@gmail.com మెయిల్ ఐడికి పంపవచ్చు. ఏవైనా సందేహాలు ఉంటే, 81258 34009 నంబర్‌కు వాట్సాప్‌లో సంప్రదించవచ్చు. ఇక లేటెందుకు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి, మీలో సృజనాత్మకతను వెలికి తీయండి!