
రైలులో జనరల్ బోగీలో కొందరు గుట్కాలు నములుతూ, ఉమ్ముతూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంటారు. పక్కవారికి అసౌకర్యం కలుగుతుందనే ఇంగిత జ్ఞానం కూడా కొందరికి ఏమాత్రం ఉండదు. ట్రైన్స్లో జనరల్ బోగీల్లో ఇలాంటి చేదు అనుభవం ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే ఉంటుంది. రైళ్లలో ఏసీ బోగీల్లోనే ప్రశాంతమైన ప్రయాణం అనే ఫీల్లో ఉన్నారేమో. ఏసీ బోగీల్లో కూడా కొందరి ప్రవర్తన ఇతరులకు చికాకు తెప్పిస్తుందని తెలిపిన ఘటన ఇది. ప్రయాణాల్లో ఉన్నప్పుడు స్మోక్ చేస్తే ఇతరులకు ఇబ్బందిగా ఉంటుందనే ఆలోచన కూడా లేకుండా ఒక యువతి రైలులోని ఏసీ బోగీలో సిగరెట్ తాగుతూ గుప్పుగుప్పున పొగ ఊదుతూ ప్రయాణికులకు చికాకు తెప్పించింది. బాత్రూమ్లోకి వెళ్లి కూడా కాదు నడి బోగీలోనే తన సీటులో కూర్చుని స్టైల్గా స్మోక్ చేస్తూ కనిపించింది.
सार्वजनिक जगहों पर धूम्रपान करना दूसरों के अधिकारों का हनन है। ट्रेन जैसी जगह पर ऐसी हरकतें बिल्कुल बर्दाश्त नहीं होनी चाहिए। @RailMinIndia को जुर्माना और सख्त सजा दोनों देनी चाहिए। #IndianRailways #TrainMeNoSmoking #RailSafetyFirst pic.twitter.com/jmLEoPLInb
— Manjul Khattar 🇮🇳 (@manjul_k1) September 15, 2025
తోటి ప్రయాణికులు ఇబ్బందికి లోనై మర్యాదగా ఆమెకు సిగరెట్ పడేయాలని, ఇబ్బందిగా ఉందని చెప్పారు. అయినా సరే.. ఆ యువతి ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా.. మొండిగా ప్రవర్తిస్తూ బరాబర్ స్మోక్ చేస్తాననే రీతిలో ప్రవర్తించింది. చెప్పిన తర్వాత కూడా సిగరెట్ తాగుతూనే ఉంది. పైగా.. ఆ యువతి దుశ్చర్యను వీడియో తీస్తుంటే.. అలా వీడియో తియ్యడం తప్పు అని, డిలీట్ చేయాలని బెదిరించింది. వీడియో డిలీట్ చేస్తానని.. సిగరెట్ బోగీలో తాగొద్దని ఆ వ్యక్తి మళ్లీ మంచిగా చెప్పాడు. అయినా.. ఆమె వినిపించుకోలేదు. నానా రచ్చ చేసింది. పొగ తాగుతూనే ఉంది. తోటి ప్రయాణికులను ఇబ్బంది పెడుతూనే ఉంది. ప్రయాణికులకు, ఆమెకు మధ్య పెద్ద గొడవే జరిగింది.
మాటలను వింటే.. ఆమె హిందీలో మాట్లాడుతుండగా, వీడియో తీస్తున్న వ్యక్తి తెలుగులోనే మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఆమెకు అర్థం కావడం కోసం అతను కూడా హిందీలోనే బదులిచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ‘ఏసీ కంపార్ట్మెంట్లో ధూమపానం నిషేధం’ అని తెలియదా అని మరో ప్రయాణికుడు ఆమెను నిలదీశాడు. పోలీసులకు సమాచారం అందించాలని, పోలీసులను పిలిస్తే గానీ ఆమె మాట వినేలా లేదని ప్రయాణికులు మాట్లాడుకుంటుండగా.. పోలీసులను పిలవండంటూ ఆ యువతి కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ప్రవర్తించడం గమనార్హం. రైల్వే శాఖ ఈ వీడియో వైరల్ కావడంతో ఈ ఘటనపై స్పందించింది. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపింది.