టాటా కంపెనీపై సైబర్ అటాక్.. చేసింది తామేనన్న స్కాటర్డ్ లాప్సస్ హంటర్స్!

టాటా కంపెనీపై సైబర్ అటాక్.. చేసింది తామేనన్న స్కాటర్డ్ లాప్సస్ హంటర్స్!

జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌(JLR) పై భారీ సైబర్‌ దాడి కారణంగా ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌, టాటా మోటార్స్‌ నేతృత్వంలో నడుస్తున్న బ్రిటిష్‌ ప్రీమియం కార్ల తయారీదారు. సెప్టెంబర్ 1, 2025న జరిగిన సైబర్ అటాక్ కారణంగా కంపెనీ అన్ని ఉత్పత్తి బృందాలను నిలిపివేసింది. కంపెనీ తమ ఐటి సిస్టమ్స్‌ను పూర్తిగా ఆఫ్‌లైన్‌కి తీసుకెళ్లి ఫోరెన్సిక్‌ దర్యాప్తు కొనసాగిస్తోంది. దీనివల్ల సెప్టెంబర్ 24 వరకు ప్రొడక్షన్ నిలిపివేయబడుతుందని కంపెనీ ప్రకటించింది. 

ఉత్పత్తి నిలిపివేత బ్రిటన్‌లోని జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ ఫ్యాక్టరీలతో పాటు స్లోవాకియా, చైనా, భారతదేశం, బ్రెజిల్ వంటి ఇతర ప్రదేశాల్లోని పరిశ్రమలను ప్రభావితం చేసింది. ఈ దాడికి "Scattered Lapsus$ Hunters" అనే హాకర్ గ్రూప్ జవాబుదారీ తీసుకుంది. ఈ గ్రూప్ ఇప్పటికే మర్క్స్ అండ్ స్పెన్సర్ వంటి ఇతర పెద్ద సంస్థలను కూడా హ్యాక్‌ చేసినట్లు రిపోర్ట్‌లు ఉన్నాయి. ఈ గ్రూప్ జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ నెట్‌వర్క్‌లో చొరబడి కస్టమర్ డేటాను కూడా పొందినట్టు ప్రకటించింది.

సైబర్ దాడికి కారణంగా జాగ్వార్‌ల ఉత్పత్తి నిలిపివేత, డీలర్లు కొత్త కార్ల నమోదు చేయలేక‌పోవడం, సర్వీస్ కేంద్రాలు భాగాలు అందించడంలో ఆలస్యాలు వంటి సమస్యలు కొనసాగుతున్నాయి. ఉత్పత్తి నిలిపివేతతో రోజుకు రూ.60 కోట్ల మేర నష్టం కలుగుతున్నట్లు వెల్లడైంది. ఈ దాడి టైమింగ్ చాలా దురదృష్టకరంగా ఉంది. ఎందుకంటే సెప్టెంబర్ ప్రారంభంలో యూకేలో కొత్త రిజిస్ట్రేషన్ ప్లేట్ల విడుదల జరుగుతుంది. ఇది కంపెనీకి చాలా ముఖ్యమైన సమయంగా తెలుస్తోంది. 

జాగ్వార్ ల్యాండ్ రోవర్ తన ఉద్యోగులు, సరఫరాదారులు, భాగస్వాములకు ఉత్పత్తి నిలిపివేత విషయాన్ని తెలియజేసింది. కంపెనీలో ఫోరెన్సిక్ దర్యాప్తు కొనసాగుతోందని, యాంత్రిక విధానాలను క్రమబద్ధంగా తిరిగి ప్రారంభించడానికి ప్రణాళికలు రూపొందిస్తోందని వెల్లడైంది. కంపెనీలో ఏ విధమైన కస్టమర్ డేటా లీక్ అయిందనే వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించిన లేదు. మెుత్తానికి ఈ ఘటన టాటా మోటార్స్‌కు కూడా ఒక పెద్ద సవాలుగా నిలుస్తోంది. టాటాలకు ఇది బ్రాండ్ వ్యాల్యూ పరంగానే కాకుండా వ్యాపార పరంగా కూడా పెద్ద నష్టాన్ని కలిగించిందని నిపుణులు అంటున్నారు.