అధికార పార్టీ అరాచకం.. ప్రశ్నిస్తే కేసులు, దాడులు

అధికార పార్టీ అరాచకం.. ప్రశ్నిస్తే కేసులు, దాడులు

వెలుగు, నెట్​వర్క్:  ప్రభుత్వానికి, రూలింగ్​ పార్టీకి వ్యతిరేకంగా వివిధ టీవీ చానళ్లు, సోషల్​ మీడియాలో మాట్లాడుతున్నాడనే కారణంతో సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం పాతర్ల పహాడ్ గ్రామానికి చెందిన ఓయూ స్టూడెంట్​ లీడర్​ జటంగి సురేశ్​పై తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన కొందరు టీఆర్ఎస్​నేతలు ఈ నెల 23న దాడి చేశారు. ఊరిలో జరిగిన గంగ దేవరమ్మ జాతరకు సురేశ్​ వస్తున్నాడని తెలిసి 20 మంది మాటువేసి కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు హైదరాబాద్​లోని ఓ ఆసుపత్రిలో  చికిత్స పొందుతుండగా, పోలీసులు రూలింగ్​ పార్టీ లీడర్లను వదిలేసి.. సురేశ్, ​అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. అంతకు కొద్దిరోజుల ముందు జర్నలిస్టు రఘు విషయంలోనూ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.  ఇది ఒక్క సురేశ్, రఘుకో పరిమితం కాలేదు. రాష్ట్రంలో అధికార పార్టీ, ప్రభుత్వంపై వివిధ అంశాల్లో విభేదిస్తూ విమర్శలు, ఆరోపణలు చేస్తున్న యువతపై ముఖ్యంగా సోషల్ ​యాక్టివిస్టులు, ప్రతిపక్ష పార్టీల లీడర్లపై అక్రమ కేసులు, దాడులు పెరుగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
సంబంధం లేని సెక్షన్ల కింద కేసులు 
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం హరిచంద్రపురంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లు క్వాలిటీగా లేవంటూ  గ్రామానికి చెందిన బోడ నరేష్, జాటోత్ రాంబాబు అనే ఇద్దరు యువకులు గతేడాది ఆగస్టులో వీడియో తీసి వాట్సప్​లో పెట్టారు. ఇది కాస్తా వైరల్​కావడంతో ప్రభుత్వ పెద్దలకు కోపం వచ్చింది. వెంటనే సంబంధిత అధికారులతో  ఫిర్యాదు చేయించగా.. కామేపల్లి పోలీసులు ఐపీసీ సెక్షన్​ 448, 504, 505 రెడ్ విత్ 34, ఇన్ఫర్మేషన్ ఆక్ట్ సెక్షన్ 67 కింద కేసు నమోదు చేశారు. అదే టైంలో క్వాలిటీపై తీవ్ర ఆరోపణలు రావడంతో ఆఫీసర్లు ఇండ్లను రిపేర్​ చేయించారు. కానీ యువకులపై పెట్టిన కేసులను ఎత్తేయకపోవడంతో వారిద్దరూ చేయని తప్పునకు పోలీస్​స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో పోలీసులు పెడుతున్న సెక్షన్లపై విమర్శలు వస్తున్నాయి. అనుమతి లేకుండా ప్రైవేట్​ప్రాపర్టీలోకి ప్రవేశిస్తే పెట్టాల్సిన సెక్షన్​448ను బహిరంగంగా కడ్తున్న డబుల్​ బెడ్​రూం ఇండ్లలోకి వెళ్లినందుకు పెట్టడం గమనార్హం. ఇక సెక్షన్​504 (ఉద్దేశపూర్వకంగా అవమానించడం, కావాలని రెచ్చగొట్టడం, ప్రజాశాంతికి భంగం కలిగించడం), సెక్షన్​ 505( ప్రజల్లో భయానికి , అల్లరికి కారణమయ్యేలా రూమర్ వ్యాప్తి), సెక్షన్​67( డిజిటల్​ మీడియా ద్వారా ఆబ్సెన్స్​మెటీరియల్–అశ్లీలం లాంటిది ప్రసారం చేయడం)లకు, డబుల్​బెడ్​రూం ఇండ్ల క్వాలిటీ లేదని పెట్టిన పోస్టులకు ఏం సంబంధమో పోలీసులకే తెలియాలి. ఇంకా 290 పబ్లిక్​న్యూసెన్స్, సెక్షన్​506 కింద ఆస్తి ధ్వంసం లాంటి  కేసులతోనూ యాక్టివిస్టులను ఇబ్బంది పెడ్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. 

కండక్టర్​ ఉద్యోగం ఊడగొట్టారు 

సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని కేసీఆర్​సర్కారు పూర్తిగా మరిచిపోయిందని, సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు సంఘ ఎన్నికల్లో ఓటర్లు ఆలోచించి ఓటేయాలని, ఆర్టీసి కార్మికుల మాదిరి ఆగం కావద్దని నిజామాబాద్ డిపోలో ఆర్టీసీ కండక్టర్ గా పనిచేస్తున్న సంజీవ్​2017  అక్టోబర్ లో ఫేస్​ బుక్​లో ఓ పోస్టు పెట్టారు. దీంతో అదే నెలలో సంజీవ్​ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. 2018 ఫిబ్రవరిలో ఏకంగా సర్వీస్ నుంచి రిమూవ్​చేశారు. దీంతో సంజీవ్​ఆర్టీసీ ఆర్ఎం, డివిజనల్ డైరెక్టర్, ఈడీలకు అప్పీల్​చేశారు. అక్కడ కూడా రిజెక్ట్​ కావడంతో ఆర్టీసీ ఎండీకి అప్పీల్​చేసుకున్నారు. అక్కడ కూడా రిజెక్ట్ అయితే కోర్టులో న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు.

నిద్రపోతున్న ఫొటో పెట్టినందుకు..

పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్​రెడ్డి అసెంబ్లీలో నిద్రపోతున్న ఫోటోను కాల్వ శ్రీరాంపూర్ కు చెందిన బీజేపీ యువ మోర్చా నాయకుడు చిలువేరు సంపత్​ ఫార్వర్డ్​చేశాడనే కారణంతో ఆయనతో పాటు  కిష్టంపేటకు చెందిన పురుషోత్తం అనిల్ పై కేసు పెట్టారు. ఇదే జిల్లాలో రాగినేడుకు చెందిన బీజేపీ కిసాన్ మోర్చా నాయకుడు తంగెడ రాజేశ్వరరావు  ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు చేసినందుకు కేసు పెట్టించి పోలీస్​స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు.

వేధింపులు భరించలేక ఊరి నుంచే వెళ్లిపోయారు

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన సైదులు  తనకు డబుల్ బెడ్ రూమ్ కేటాయించలేదనే కోపంతో మంత్రి జగదీశ్ రెడ్డి కి వ్యతిరేకంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో కొంతమంది టీఆర్ఎస్ నాయకులు సైదులుపై ఫిర్యాదు చేయగా, పోలీసులు సైదులును అదుపులోకి తీసుకొని పీడీయాక్ట్​ పెట్టారు. చివ్వెంల పోలీస్ స్టేషన్ లో నాలుగురోజులు ఉంచి తీవ్రంగా కొట్టడంతో సైదులు కుటుంబంతో సహా గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు.

సూసైడ్​ అటెంప్ట్​ చేసిన.. 

2020 జులై 14న నాకు సంబంధం లేని ‘వాయిస్ ఆఫ్​ తెలంగాణ’ అనే ఫేస్​బుక్​ అకౌంట్​లో మంత్రి కొప్పుల ఈశ్వర్ మీద అభ్యంతరకర పోస్టు పెట్టినట్లుగా నాపై  కేసు పెట్టిన్రు. అదే రోజు రాత్రి  10 –11గంటల మధ్య నాతోపాటు మా అమ్మ, తమ్ముడు, బావపై ఎస్సీ, ఎస్టీ కింద మరో కేసు బుక్​ చేసిన్రు. దీంతో మేం హైకోర్టు కు అప్పీల్ కు వెళ్తే  ఈలోపే నా కుటుంబాన్ని రిమాండ్​ చేయాలని చూసిన్రు.  పదే పదే స్టేషన్​కు పిలిపిస్తుండడంతో వేధింపులు భరించలేక అప్పటి జగిత్యాల ఇన్​చార్జి ఎస్పీ, కరీంనగర్ కమిషనరేట్​కు వెళ్లి సూసైడ్​ అటెంప్ట్​చేసిన. ఐదు రోజులు హాస్పిటల్​లో ప్రాణాలతో పోరాడి బయటపడ్డ. కానీ  ఇప్పటివరకు నాకు ఎలాంటి న్యాయం జరగలేదు.
- చిట్ల విజయ్, గోపులాపూర్, బుగ్గారం మండలం, జగిత్యాల జిల్లా

లాయర్లనూ వదలట్లే.. 

మంథనికి చెందిన లాయర్​వామన్​రావు దంపతులను నడిరోడ్డుపై నరికి చంపిన ఘటన తెలిసిందే. ఆ తర్వాత కూడా పరిస్థితులు మారడం లేదు. ప్రజాసమస్య లపై పోరాడుతున్న అనేక మంది లాయర్లకు బెదిరింపులు తప్పడం లేదు. మందమర్రి పట్టణానికి చెందిన  హైకోర్టు లాయర్​ముత్యాల వెంకటేశ్​ అలియాస్​ ఎంవీ గుణ కొద్దిరోజులుగా మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో టీఆర్ఎస్​ లీడర్లు చేస్తున్న భూకబ్జాలు, అక్రమ నిర్మాణాలపై సోషల్​ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. దీంతో తనకు బెదిరింపులు మొదలయ్యాయి. తనను చంపేస్తామంటూ ఎమ్మెల్యే బాల్క సుమన్​ అనుచరులు బెదిరిస్తున్నారని రామగుండం సీపీ సత్యనారాయణకు లాయర్​గుణ ఇటీవల ఫిర్యాదు  చేశారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు మరింత రెచ్చిపోయారు. మందమర్రి, రామకృష్ణా పూర్​ పోలీస్​స్టేషన్లలో గుణ​పై ఉల్టా 505 సెక్షన్ల కింద రెండు కేసులు, మందమర్రిలో మరో కేసు పెట్టించారు.  వీటిపై గుణ హైకోర్టును, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించారు.