కరోనా రూల్స్ పాటించకుంటే కేసులు

కరోనా రూల్స్ పాటించకుంటే కేసులు
  • మార్చి ఫస్ట్ నుంచి ప్రైవేట్ స్కూళ్లలో ఆఫీసర్ల తనిఖీలు
  • విద్యాశాఖ నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు స్కూళ్లలో రూల్స్ కు విరుద్ధంగా క్లాసులు నిర్వహిస్తే కేసులు పెట్టాలని స్కూల్​ఎడ్యుకేషన్ అధికారులు యోచిస్తున్నారు. ఇందుకు వచ్చే నెల ఫస్ట్​ నుంచి ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు. బుధవారం నుంచి 6,7,8 తరగతులకు ఫిజికల్ క్లాసులు ప్రారంభమయ్యాయి. ప్రైవేటు బడుల్లో బుధవారం 9 శాతం అటెండెన్స్ ఉండగా, గురువారం 14 శాతం స్టూడెంట్స్ హాజరయ్యారు. కరోనా రూల్స్ పాటించాలంటూ రెండ్రోజుల కింద విద్యాశాఖ అన్ని స్కూళ్లకు గైడ్ లైన్స్​ రిలీజ్ చేసింది. దీనిప్రకారం ప్రతి క్లాస్​రూమ్​లో 20 మంది మాత్రమే కూర్చోవాలి. ప్రతి 6 ఫీట్లకు ఒక్కరు మాత్రమే ఉండేలా ఏర్పాట్లు చేయాలి. స్టూడెంట్లు ఎక్కువగా ఉండి, క్లాస్ రూములు సరిపోకపోతే, షిప్ట్​ పద్ధతిలో బడులు నిర్వహించాలని ఆఫీసర్లు సూచించారు. కానీ ప్రైవేటు స్కూళ్లలో ఈ రూల్స్ అమలవుతాయనే నమ్మకం విద్యాశాఖ ఆఫీసర్లలోనూ లేదు. దీంతో మార్చి ఫస్ట్​ నుంచి ఆర్జేడీల నేతృత్వంలో బృందాలను ఏర్పాటు చేసి, ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగే బడులపై పాండమిక్ యాక్ట్ ప్రకారం కేసులు పెట్టాలనీ, ఇప్పటికే జిల్లాల ఆఫీసర్లకు మౌఖిక ఆదేశాలూ జారీచేసింది. మరోపక్క రెండు రోజుల్లో షిఫ్ట్ సిస్టమ్​లో కొనసాగే బడులపై స్పష్టత రానున్నట్టు అధికారులు చెప్పారు.

రెండో రోజు 14 శాతం హాజరు

6 నుంచి 8వ తరగతి వరకు ప్రారంభమైన ఫిజికల్ క్లాసులకు గురువారం రెండో రోజు 14 శాతం స్టూడెంట్లు హాజరైనట్టు స్కూల్ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన తెలిపారు. లోకల్ బాడీ స్కూళ్లలో17శాతం, మోడల్ స్కూళ్లలో 7, కేజీబీవీల్లో ఒక శాతం మంది హాజరయ్యారని చెప్పారు. సొసైటీ గురుకులాల్లో ఇంకా స్టూడెంట్స్ రాలేదని పేర్కొన్నారు.