ప్రముఖుల అండతో కోట్లకు పడగలెత్తిన చీకోటి

ప్రముఖుల అండతో కోట్లకు పడగలెత్తిన చీకోటి

క్యాసినో, పేకాట.. రెండూ అక్రమ దందాలే. రాజకీయ నాయకులు, పోలీసులతో ఉన్న పరిచయాలతో కోట్లకు పడగలెత్తారు చీకోటి ప్రవీణ్, మాధవ్ రెడ్డి. క్యాసినో, పేకాట ఆడాలనుకునే వారికోసం ప్రత్యేకంగా టూర్లు ఏర్పాటు చేస్తున్నారు. వినడానికి విచిత్రంగా ఉన్నా.. వీకెండ్స్ లో క్యాసినో ఆడటానికి ఫారిన్ టూర్లకు వెళ్తున్న వారు హైదరాబాద్ సిటీలో చాలామంది ఉన్నారు. పైసలిస్తే చాలు.. అంతా వీళ్లే చూసుకుంటారు. రోజులను బట్టి ప్యాకేజీ రేట్లుంటాయి. రానుపోను ఖర్చులు కలిపి ఐదు  రోజులకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల దాకా వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో ఈ టూర్లు ఎక్కువగా శ్రీలంకకు నడిచేవి. కానీ అక్కడ రాజకీయ సంక్షోభం ముసురుకున్నప్పటి నుంచి.. అంతా నేపాల్ కు షిఫ్ట్ అయ్యింది. ఈ ఏడాది సంక్రాంతి పండుగ టైంలో గుడివాడలో క్యాసినో ఏర్పాటు చేశారు. ఇది అప్పట్లో సంచలనమైంది. దీనిపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

ఒకప్పుడు సాదాసీదా పేకాట క్లబ్బులు నడిపి..

ఇంత పెద్ద దందా నడిపిస్తున్న వీళ్లు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. చీకోటి ప్రవీణ్‌ ఒకప్పుడు నగరంలో సాదాసీదా పేకాట క్లబ్బులు నడిపించిన వ్యక్తి. బేగంపేట, వనస్థలిపురం, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో సెలబ్రిటీల కోసమే క్యాసినోలు నడిపించేవాడు. ప్రవీణ్ గతంలో గోవాలోని ఓ క్యాసినోలో టేబుల్ నిర్వాహకుడిగా ఉండేవాడని అంటున్నారు. గుడివాడ, గన్నవరానికి చెందిన ఇద్దరు నాయకులు రెగ్యులర్ గా అక్కడికి వెళ్తుండటంతో వారితో పరిచయం అయ్యింది. ఈ పరిచయాలతోనే గుడివాడలో క్యాసినో ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ ఒక్క ఈవెంట్ లోనే కోట్ల రూపాయలు వచ్చినట్టు సమాచారం.  

కనుసన్నల్లో సిటీలోని కొన్ని క్లబ్బులు ..

ప్రవీణ్ చీకటి దందా చాలా ఏళ్ల నుంచి నడుస్తోందని సమాచారం. గోవా, శ్రీలంక, నేపాల్, థాయ్ లాండ్ లతో పాటు రాష్ట్రంలో కూడా  క్యాసినోలు నిర్వహించి గతంలో పోలీసులకు దొరికాడు. సిటీలోని కొన్ని క్లబ్బులు పూర్తిగా ఇతని కనుసన్నల్లో నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఓ రియల్టర్‌ ను బెదిరించి రూ.30 లక్షలు తీసుకున్న కేసులో ప్రవీణ్ కొద్ది రోజులు జైలుకు పోయాడు. అప్పుడు ఏర్పడిన పరిచయాలతోనే ప్రవీణ్ క్యాసినో నిర్వాహకుడిగా మారినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో క్లబ్స్‌ నిషేధించడంతో గోవాకు చెందిన ప్రముఖ గో డాడీ క్యాసినోలో పార్ట్‌ నర్‌గా మారాడని, ఆపై చెన్నై శివార్లలో సొంతంగా ఓ క్యాసినో పెట్టాడని తెలుస్తోంది. 

2014 తర్వాత సుడి మారిపోయింది..

2014 తర్వాత అతడి సుడి మారిపోయిందని చెబుతారు. ఇద్దరు మంత్రులు, 16 మంది ఎమ్మెల్యేల సాన్నిహిత్యంతో చీకోటి తన దందాను విదేశాలకూ విస్తరించాడనే ఆరోపణలున్నాయి. ప్రత్యేక విమానాల్లో ఇండోనేషియా, నేపాల్‌ కు తీసుకెళ్లి కోట్లలో పేకాట ఆడించడం ఇప్పుడు రెగ్యులర్ అయిపోయిందంటున్నారు. ఆట కోసం వెళ్లే వారు అక్రమంగా డబ్బు తీసుకెళ్లేందుకు వీళ్లు సహకరిస్తున్నట్టు సమాచారం. అలాగే.. విదేశాల్లో క్యాసినో, పేకాట ఆడి గెలుచుకున్న డబ్బులను హవాలా మార్గంలో రాష్ట్రానికి రప్పిస్తారని తెలుస్తోంది. 

భారత కరెన్సీని హవాలా రూపంలో అందించి.. 

హైదరాబాద్‌లో భారత కరెన్సీని హవాలా రూపంలో అందించి.. నేపాల్, ఇండోనేషియాలో తనకు ఎంత కావాలో ఆ మేరకు అక్కడి కరెన్సీని తీసుకునేవాడు. ఇలా గత జూన్‌ 10, 11, 12, 13 తేదీల్లో 8 ప్రత్యేక విమానాల్లో నేపాల్‌లోని హోటల్‌ మిచీక్రౌన్‌లో భారీ ఎత్తున క్యాసినో ఏర్పాటుచేసి చాలామంది ప్రముఖులను తరలించినట్టు సమాచారం. దీనిపై సమాచారం అందుకున్న ఈడీ అధికారులు హవాలా ద్వారా వెళ్లిన నగదుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించి.. మాధవ్ రెడ్డి, ప్రవీణ్ ఇళ్లలో సోదాలు చేసినట్టు తెలుస్తోంది. చీకోటి ప్రవీణ్ ఇంట్లో సోదాలు చేసిన ఈడీ అధికారులు క్యాసినో ద్వారా జరిగిన హవాలా లావాదేవీలతో పాటు.. బంగారం దందా కూడా జరిగిందని గుర్తించినట్లు తెలుస్తోంది. చెన్నైకి చెందిన ప్రముఖ బంగారు వ్యాపారికి హవాలా ద్వారా డబ్బు ఏర్పాట్లు చేసి, బంగారం బ్లాక్‌ మార్కెట్‌ ద్వారా తీసుకున్నట్లు ఈడీ గుర్తించినట్టు సమాచారం. 

ప్రతీ శుక్ర, శని, ఆదివారాల్లోనే విదేశాల్లో క్యాసినో.. 

చీకోటి ప్రవీణ్‌ ఒక్కో ఆటకు ఒక్కో రేటు ఫిక్స్‌ చేస్తాడని.. ఒక్కో దేశానికి ఒక్కో రకమైన డిపాజిట్‌ తీసుకుంటాడని అంటున్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రతీ శుక్ర, శని, ఆదివారాల్లోనే విదేశాలకు క్యాసినో ఆడేందుకు ఏర్పాట్లు చేస్తాడు. ఇలా తనకు 200 మంది రెగ్యులర్‌ కస్టమర్లుండగా వారికి అన్ని ఏర్పాట్లు తానే దగ్గరుండి చేసి పెడతాడని అంటుంటారు. ప్రయాణానికి ముందే కస్టమర్ల నుంచి డిపాజిట్లు తీసుకుంటాడు. 

5 లక్షల నుంచి 50లక్షల వరకు డిపాజిట్‌..

ఇండోనేషియా, నేపాల్‌కు క్యాసినో ఆడేందుకు వెళ్లే వారు 5 లక్షల నుంచి 50లక్షల వరకు డిపాజిట్‌ చేస్తారు. 15లక్షల వరకు చెల్లించిన వారిని సాధారణ విమానాల్లో ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ లో.. 20లక్షల నుంచి 50 లక్షలు డిపాజిట్‌ చేసే వారిని ప్రత్యేక విమానాల్లో తీసుకెళ్తాడని సమాచారం. ఒక్కో టేబుల్‌పై 2 లక్షల నుంచి 2కోట్ల వరకు పేకాట నడుస్తుందని తెలుస్తోంది. ఇందులో ఒక్కో గేమ్‌ను ఒక్కో కిట్‌ గా పిలుస్తారు. ప్రతీ కిట్‌ పై 5 శాతం కమిషన్‌ను ముందే తీసుకుంటాడు. 

ప్రవీణ్ తో స్నేహం చేశాక.. కోట్లకు పడగలెత్తిన మాధవ్ రెడ్డి 

బోయిన్ పల్లిలో నివాసం ఉండే మాధవరెడ్డి 6 నెలల క్రితం వరకు ఈవెంట్ ఆర్గనైజర్ గా పనిచేసేవాడు. గతంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆయన.. ఈ మధ్యే సడెన్ గా కోట్లకు పడగలెత్తాడు. చీకోటి ప్రవీణ్ తో స్నేహం చేశాకే మాధవ్ రెడ్డి బాగా సంపాదించాడని స్థానికులు అంటున్నారు. చీకోటి ప్రవీణ్ కు మాధవ్ రెడ్డి రైట్ హ్యాండ్ లాంటివాడని వాళ్ల గురించి తెలిసిన వాళ్లు చెబుతున్నారు. మాధవ్ రెడ్డి రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన కొందరు ముఖ్య నాయకులతో సన్నిహిత సంబంధాలున్నట్టు తెలుస్తోంది. 

ప్రముఖులను తీసుకొచ్చే బాధ్యత మాధవ్ రెడ్డిది..

ప్రవీణ్‌ నిర్వహించే క్యాసినోలు, గ్యాంబ్లింగ్‌ లకు ప్రముఖులను తీసుకొచ్చే బాధ్యతంతా మాధవ్ రెడ్డి చూసుకుంటారని అంటుంటారు. బోయిన్‌పల్లికే చెందిన ఓ వ్యక్తి ఇటీవల నేపాల్‌ లోని వీరి క్యాసినోకు వెళ్లారు. దీనికోసం ముందుగానే 10 లక్షలు చెల్లించారని.. అయితే అక్కడ అదనపు ఖర్చులకంటూ మాధవరెడ్డి ఆయనకు డబ్బులు ఇచ్చాడని,  తిరిగి వచ్చాక ఆ డబ్బు ఇవ్వాలని బెదిరించి ఆ వ్యక్తికి సంబంధించిన స్థలాన్ని తమ వారి పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు తెలుస్తోంది. యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాలకు చెందిన కొందరు రెగ్యులర్ గా పేకాడతారని.. వీళ్ల నుంచీ బలవంతంగా భూములు లాక్కున్నారని ఆరోపణలున్నాయి. 

టాలీవుడ్ నటుడితో వివాదం..

టాలీవుడ్ కు చెందిన ఓ నటుడితోనూ గతంలో వివాదం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చీకోటి ప్రవీణ్ దగ్గర రేంజ్ రోవర్ కారు ఉంది. కొద్ది రోజుల క్రితమే ఆయన దాన్ని కొనుగోలు చేశారు. అయితే.. కారు బుక్ చేసినప్పుడు ఓ సినీ నటుడు కూడా తనకు ఆ కారే కావాలని షోరూం నిర్వాహకులను అడిగారట. ఈ విషయం ప్రవీణ్ కు తెలియడంతో.. అతడికి ఫోన్ చేసి.. పక్కకు తప్పుకోవాలని వార్నింగ్ ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి.

అమీషా పటేల్, ఈషా రెబ్బా, డింపుల్ హయతి, ముమైత్ ఖాన్ తో ప్రచారం 

విదేశాల్లో నిర్వహించే క్యాసినోలకు పంటర్లను ఎట్రాక్ట్ చేసేందుకు సెలబ్రిటీతో ప్రమోషన్ చేయించేవారు. టాలీవుడ్, బాలీవుడ్ కు చెందిన చాలామంది హీరోయిన్లతో ప్రవీణ్, మాధవ్ రెడ్డి ప్రమోషనల్ వీడియోలు చేయించారు. గత నెలలో క్యాసినో కోసం అమీషా పటేల్, ఈషా రెబ్బా, డింపుల్ హయతి, ముమైత్ ఖాన్ తో ప్రచారం చేసి ఇన్ స్టా లో వీడియోలు పెట్టుకున్నాడు. తాము క్యాసినోకు వస్తున్నామని ఆ వీడియోలో వాళ్లు చెబుతున్నారు. 

20 ఎకరాల్లో ఫామ్ హౌస్.. ప్రైవేట్ సెక్యూరిటీ 

సిటీ శివారు కడ్తాల్ లో ప్రవీణ్ కు 20 ఎకరాల్లో ఓ ఫామ్ హౌస్ ఉంది. ఇదంతా ఓ సామ్రాజ్యంలా ఉంటుందని అంటుంటారు. చుట్టూ ఎప్పుడూ ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుందని చెబుతారు. ప్రవీణ్ ఇక్కడే రెగ్యులర్ గా రిలాక్స్ అవుతారని.. రాజకీయ నాయకులు, పోలీసు ఉన్నతాధికారులకు ఇక్కడే పార్టీలు ఇస్తారని టాక్ . వారికోసం టాలీవుడ్, బాలీవుడ్ నటులతో స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేస్తాడని సమాచారం. అంతేకాదు.. ఫామ్ హౌస్ లో అనేక జంతువులు, పక్షులను పెంచుతున్నాడు. కొండ చిలువలు, చిలుకలు, గుర్రాలు, ఉడుములు, ఆస్ట్రిచ్ లు, పెద్ద పెద్ద పాములు కూడా ఉన్నాయి. వీటితో పాటు గడిపిన వీడియోలు.. తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు ప్రవీణ్. అయితే అక్రమంగా అడవి జంతువులను పెంచడంపై ఇన్నాళ్లకు అటవీశాఖ స్పందించింది. ఎక్కడి నుంచి తెచ్చారు..? అక్కడ ఏమేం ఉన్నాయి ? అనే  దానిపై ఎంక్వైరీ చేస్తున్నట్టు తెలుస్తోంది. 

బర్త్ డే పార్టీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసులు

ప్రతీ ఏటా ఇతని బర్త్ డే వేడుకలకు భారీ హడావుడి ఉంటుందని తెలిసినవారు చెబుతున్నారు. గత నెలలో గ్రాండ్ గా వేడుకలు నిర్వహించారు. హైదరాబాద్ లో ఆయనుండే కాలనీలో భారీ ర్యాలీ తీశారు. ఆయన ఇచ్చిన పార్టీలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది. చీకోటి ప్రవీణ్ కారుపై మంత్రి మల్లారెడ్డి అసెంబ్లీ పాస్ స్టిక్కర్ ఉండటం కలకలం రేపింది. అయితే.. తాను ఎప్పుడో స్టిక్కర్ పడేశానని.. దాన్ని ఎవరైనా తీసుకుని ఉండొచ్చని మంత్రి మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. మరోవైపు.. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన ప్రముఖులతో ప్రవీణ్ కు సంబధాలున్నాయి. అంతేకాదు ముఖ్యమైన కాంట్రాక్టర్లతోనూ లింకులున్నాయని తెలుస్తోంది.