వెలుగు ఓపెన్ పేజీ.. కులగణనపై సుప్రీంతీర్పు చరిత్రాత్మకం

వెలుగు ఓపెన్ పేజీ.. కులగణనపై సుప్రీంతీర్పు చరిత్రాత్మకం

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  ‘కొలవలేనిది సరిచేయలేం. అన్నారు’. అంటే  దేశంలో అసమానతలను తొలగించాలంటే కులగణన ఆ దిశగా ఒక చారిత్రాత్మక అవసరం. ఈ క్రమంలో నిన్న దేశంలో జనగణనలో భాగంగా కులగణన చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడం దేశ రాజకీయ, సామాజిక చరిత్రలో కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. 

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ 

సూర్యకాంత్ ఈ అంశం ప్రభుత్వ విధానానికి సంబంధించినదని, న్యాయస్థానం జోక్యం చేసుకోలేదని  స్పష్టం చేయడం ద్వారా కులగణనకు ఉన్న న్యాయపరమైన అడ్డంకులను తొలగించారు.ఇది పరోక్షంగా కులగణన అవసరాన్ని అంగీకరించినట్టే.  రాజ్యాంగం సమానత్వాన్ని హామీ ఇచ్చినా, వాస్తవ జీవితంలో అవకాశాలు, భూమి, సంపద, విద్య, ఉద్యోగాలు, రాజకీయ అధికారం అన్నీ సమానంగా పంపిణీ జరగలేదు.

కులగణనపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా?

తెలంగాణ  రాష్ట్ర  ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా సమగ్ర కులగణన సర్వే 2024ను నిర్వహించింది. ఈ లెక్కలను ఇటీవల అధికారికంగా కూడా విడుదల చేసింది. ఈ సర్వే అన్ని రంగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల వెనుకబాటును వెల్లడించింది. మరోవైపు రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న బీసీ సమూహానికి 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఉద్యమం బలంగా ముందుకెళ్ళింది. దీంతో ఈసారి జనగణనతోపాటు కులగణన చేస్తామని కేంద్రం ప్రకటించడం చట్టబద్ధమైన హామీగా పలువురు భావించారు. కానీ ఇటీవల జనగణన 2027లో భాగంగా మొదటి దశలో జరుగుతున్న ఇండ్ల జాబితా, ఇండ్ల గణనలో ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీ కాలమ్ లేకపోవడం పలు ప్రశ్నలకు దారితీసింది. 

ఈ సర్వేలో ప్రతి ఇల్లు, గుడి, బడితో పాటు పశువుల పాకను కూడా గణించాలన్నప్పుడు..బీసీల ఇళ్లను ప్రత్యేకంగా ఎందుకు లెక్కించరు? ప్రభుత్వం నిజంగా కులగణనకు కట్టుబడి ఉందా? లేక రాజకీయ ఒత్తిడిని తగ్గించేందుకు మాత్రమే ప్రకటనలు చేస్తున్నదా? అనే అనుమానాలకు తావిస్తోంది.  ప్రస్తుతం బీసీల ఇళ్లను లెక్కించనప్పుడు ఫిబ్రవరి 2027లో జరిగే జనగణనలో  బీసీల గణన ఎలా చేస్తారో స్పష్టతనివ్వాలని బీసీ మేధావులు, ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు.  జనగణనతోపాటు  కులగణన చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారికంగా ప్రకటించారు.  కానీ, వాస్తవ గెజిట్ నోటిఫికేషన్​లో  కులగణన అంశం చేర్చలేదు. 

కులగణనతోనే సామాజిక న్యాయం

భారతదేశ ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులు తెలుసుకొని ప్రయోజనం కల్పించడానికి జనగణనతోపాటు కులగణన చేయడం అత్యావశ్యకం. కులగణన ద్వారా దేశ సంపదలో ఎవరి వాటా ఎంతో తెలుస్తుంది.  భారతదేశంలో చివరిసారిగా పూర్తిస్థాయి కులగణన 1931లో జరిగింది. అనంతరం 2011లో సామాజిక, ఆర్థిక కులగణన జరిగినా, ఆ డేటా  పూర్తిగా ప్రజలకు  అందుబాటులోకి రాలేదు. 

ప్రస్తుత బీసీల జనాభా, వారి ఆర్థిక-, సామాజిక స్థితి గురించి కచ్చితమైన డేటా లేకపోవడం వల్ల రిజర్వేషన్ల సముచిత పంపిణీ కష్టమవుతోంది.  పాలసీ నిర్ణయాలు కేవలం అంచనాలపై మాత్రమే ఆధారపడుతున్నాయి. దశాబ్దాలుగా రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం  పరిమితిని ఎత్తివేయాలని, జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు వాటా దక్కాలని బీసీ వర్గాలు  డిమాండ్  చేస్తున్నారు. కులగణనను సామాజిక న్యాయానికి పునాదిగా పలు వర్గాలు భావిస్తున్నాయి.     కాబట్టి  కులగణన  అనేది విభజన రాజకీయాల      కోసం కాదు,    సామాజిక అవసరంగా పాలకులు  పరిగణించాలి.

- సంపతి రమేష్,సోషల్​ ఎనలిస్ట్

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.