కుల నిర్మూలన సమాజం కోసం మారథాన్

కుల నిర్మూలన సమాజం కోసం మారథాన్

ముషీరాబాద్, వెలుగు : కుల నిర్మూలన సాంస్కృతిక ఉత్సవాలలో భాగంగా తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్ వరకు మారథాన్ వాక్​నిర్వహించారు. దీనికి రిటైర్డ్ జడ్జి రాధా రాణి హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుల నిర్మూలన కేవలం నినాదం కాదని ఆచరణలో బలమైన ఉద్యమంగా రావాలని ఆకాంక్షించారు. తర్వాత సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కుల మతాల సంకెళ్ళను తెంచిన కవి సమ్మేళనం నిర్వహించారు.

కార్యక్రమానికి ప్రముఖ కవి యాకుబ్, ఎస్ వినయ్ కుమార్ హాజరై మాట్లాడారు. కుల వ్యవస్థను ప్రశ్నించే కవిత్వం కావాలని, సమాజాన్ని పట్టి పీడుస్తున్న కులం పోవాలని, అభివృద్ధికి అడ్డుగోడగా నిలిచిన కుల గోడల్ని కూల్చేందుకు కవులు అక్షర ఆయుధాలు కావాలని పిలుపునిచ్చారు.