కులమే నాకు రాజకీయ ప్రత్యర్థి: కమల్ హాసన్

కులమే నాకు రాజకీయ ప్రత్యర్థి: కమల్ హాసన్

కులం అనేది తనకు ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అని మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ అన్నారు. సినీ నిర్మాత పీఏ రంజిత్ ఏర్పాటు చేసిన నీలం బుక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తనకు నిజజీవితంలో కాని.. రాజకీయంగా కాని కులం అనేది పెద్ద ప్రత్యర్థి అని కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఎప్పటికీ తన అభిప్రాయం మారదని చెప్పారు. తనకు 21 ఏళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచీ తాను ఇదే విషయం చెబుతున్నానని.. ఇప్పుడు కూడా అదే మాట అంటున్నా అని కమల్ స్పష్టం చేశారు. 

దేవుడి పై తనకున్న అభిప్రాయాన్ని కూడా కమల్ హాసన్ చెప్పారు. చక్రం కనిపెట్టిన తరువాత మానవుడు చేసిన గొప్ప సృష్టి దేవుడని అన్నారు. అలాంటి దేవుడి పేరుతో కొందరు దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోవద్దని చెప్పారు. ఇక కమల్‌హాసన్‌ కళాత్మక చిత్రాలను రూపొందించే ఫార్ములాను తయారు చేశారని నిర్మాత రంజిత్ ప్రశంసించారు. ఒక విధంగా కమల్ హాసన్ వల్లే ఇప్పటికీ అలాంటి చిత్రాలను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారని చెప్పారు. రాజకీయంగా ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు నీలం బుక్స్‌ను ఒక వేదికగా ఎంచుకున్నానని రంజిత్ వివరించారు.