
సంగారెడ్డి, వెలుగు: పటాన్ చెరు బీఆర్‌ఎస్ పార్టీలో కుల రాజకీయాలు కలకలం రేపుతున్నాయి. నియోజకవర్గంలో రెడ్డి, బీసీ సామాజిక వర్గాల నేతల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు దాడులు చేసుకునే వరకు వెళ్లింది. శ్రీరామనవమి రోజు పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్, కోదండరామ ఆలయ కమిటీ చైర్మన్ మనోహర్ రెడ్డి మధ్య జరిగిన గొడవ దీనికి ఆజ్యం పోసింది. ఈ ఘటనలో బాధితుడైన మెట్టుకుమార్‌కు బీసీ సంఘాల నేతలు మద్దతుగా నిలిచారు. అగ్రవర్ణ లీడర్లు కావాలనే బీసీలను టార్గెట్ చేస్తున్నారని, ఎమ్మెల్యే ప్రమేయం కూడా ఉందని ఆరోపిస్తున్నారు. రెడ్డి వర్గం మాత్రం బీసీ నేతలే గొడవలు చేస్తూ ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తున్నారని కౌంటర్‌కు దిగుతున్నారు. కాగా, ఇరువురు బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన సీనియర్ లీడర్లే కావడంతో ఏం చేయాలో తెలియక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తలపట్టుకుంటున్నారు.
పోలీస్ స్టేషన్‌లో ఇరువర్గాల ఫిర్యాదు
కార్పొరేటర్ మెట్టు కుమార్‌పై దాడి చేసిన వెంటనే ఆయన రెడ్డి వర్గీయులపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రెండు రోజుల తర్వాత మనోహర్ రెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరులు కూడా పీఎస్‌కు వెళ్లి తమ ఇళ్లపై రాళ్లతో దాడి చేశారని కార్పొరేటర్‌తో పాటు ఆయన అనుచరులపై పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా శనివారం కార్పొరేటర్ మెట్టు కుమార్ ప్రెస్‌మీట్ పెట్టగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి మద్దతుగా నిలవడం గమనార్హం. ఈ సందర్భంగా మెట్టుకుమార్ మాట్లాడుతూ తాను కల్యాణోత్సవం కూర్చున్నందుకు ఓర్వలేకనే తనపై దాడులు చేశారని ఆరోపించారు.
ఎమ్మెల్యేకు నీలం మధు ఎఫెక్ట్
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి ఇప్పటికే చిట్కుల్ సర్పంచ్, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు వ్యవహారం తలనొప్పిగా మారింది. మధుయువసేన పేరుతో సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్న ఆయన బీసీ వర్గానికి జరుగుతున్న అన్యాయంపై నిత్యం గొంతు ఎత్తుతూనే ఉన్నారు. ఒకే పార్టీలో ఉన్నా తాను బీసీననే చిన్నచూపుతో రాజకీయంగా కక్ష సాధిస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో చిట్కుల్‌లో మధు బర్త్‌డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించడంతో ఎమ్మెల్యేపై విమర్శలు వచ్చాయి.
గొడవ మొదలైందిలా..
పటాన్ చెరు పట్టణంలోని కోదండ సీతారామాలయంలో శ్రీరామనవమి రోజు కార్పొరేటర్ మెట్టుకుమార్ హరేరామ హరేకృష్ణ సంస్థ వారు భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం భజన జరుగుతుండగా ఆలయ కమిటీ చైర్మన్ మనోహర్ రెడ్డి అనుచరులు ప్రోగ్రామ్‌ను అడ్డుకొని మైకులు తొలగించి భజన బృందాన్ని అక్కడి నుంచి పంపించారు. విషయం తెలుసుకున్న కార్పొరేటర్ దైవ కార్యంలో రాజకీయాలేంటని మనోహర్ రెడ్డి వర్గీయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయంలో తమకు గౌరవం ఇవ్వడం లేదని మండిపడ్డారు. అనంతరం కల్యాణోత్సవం సందర్భంగా మనోహర్ రెడ్డి తమ ఆధీనంలో ఉన్న గుడిలో మీ పెత్తనం ఏంటని కార్పొరేటర్‌ను నిలదీయడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో మనోహర్‌రెడ్డి అనుచరులు కార్పొరేటర్‌పై చేయి చేసుకునే వరకు వెళ్లింది. ఇష్యూ కావడంతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇద్దరిని పిలిపించి సయోధ్య కుదుర్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో మనోహర్ రెడ్డి కొడుకు కార్పొరేటర్‌పై చేయి చేసుకున్నాడని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీంతో ఇరువర్గాలు నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే వరకు వెళ్లడంతో వైరం మరింత
ముదిరింది.