- 21 మందిపై కేసులు, 9 మంది అరెస్ట్
ఖమ్మం, వెలుగు: వెలుగుమట్లలో భూదాన్ భూముల పేరుతో కొందరు ముఠాగా ఏర్పడి నిరుపేదల నుంచి సుమారు రూ.3 కోట్ల వరకు అక్రమంగా వసూలు చేసినట్లు పోలీసులు తేల్చారు. యూసీసీఆర్ఎల్(ఎంఎల్) ఓపీడీఆర్ భూదాన్ కమిటీ పేరుతో ఈ మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు.
ఈ విషయాన్ని ఖమ్మం లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీసీపీ ప్రసాదరావు శనివారం విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో తెలిపారు. నకిలీ భూదాన్ పట్టాలు సృష్టించి పేదలను మోసం చేసిన 21 మందిపై జిల్లాలో ఇప్పటివరకు 19 క్రిమినల్ కేసులు నమోదు చేశామని, అందులో 9 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
నిందితులు చూపిస్తున్న భూదాన్ కేటాయింపులు పూర్తిగా నకిలీవని భూదాన్ యజ్ఞ బోర్డు స్టాండర్డ్ కౌన్సిల్ స్పష్టం చేసిందన్నారు. బాధితుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసినట్లు తెలిపారు. ఈ ముఠా సభ్యులపై గతంలో కూడా సుమారు 15 కేసులు నమోదైనట్లు వెల్లడించారు.
దర్యాప్తు క్షేత్రస్థాయిలో కొనసాగుతోందని, ఎవరైనా ఈ మోసానికి గురై ఉంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, నిందితుల నుంచి వసూలు చేసిన డబ్బును తిరిగి బాధితులకు అందజేస్తామని స్పష్టం చేశారు. ఖమ్మం ఖానాపూర్ హవేలీ పోలీస్ స్టేషన్‌తో పాటు సత్తుపల్లి, కొణిజర్ల పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు తెలిపారు.
