సీఎం కేసీఆర్​ పాలనలో కులవృత్తులు నిర్వీర్యమయ్యాయి : రేవంత్ రెడ్డి

సీఎం కేసీఆర్​ పాలనలో కులవృత్తులు నిర్వీర్యమయ్యాయి  : రేవంత్ రెడ్డి

సమర్థంగా ఎదుర్కోవాలని అనుబంధ సంఘాలకు రేవంత్​ పిలుపు

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో ప్రతిపక్షంగా కాంగ్రెస్​ లేకుండా చేయాలని బీజేపీ, టీఆర్​ఎస్​ కుట్రలు చేస్తున్నాయని, దీన్ని సమర్థంగా ఎదుర్కోవాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ అనుబంధ సంఘాల నేతలకు పిలుపునిచ్చారు. సోమవారం గాంధీ భవన్​లో ఏర్పాటు చేసిన అనుబంధ సంఘాల మీటింగ్​లో ఆయన మాట్లాడారు. సర్కారుపై పోరాటంలో అనుబంధ సంఘాల పాత్ర కీలకమని, అన్ని రకాల ఎత్తుగడలపై అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే ప్రమాదంలో పడతామని రేవంత్​ హెచ్చరించారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున కార్యక్రమాలు చురుగ్గా నిర్వహించి ప్రజల్ని చైతన్య పర్చాలన్నారు. పార్టీలో ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ కాదని, అందరూ కలిసి బాధ్యతగా కార్యాచరణ రూపొందించి ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు. 

కుల వృత్తులు నిర్వీర్యం 

సీఎం కేసీఆర్​ పాలనలో కులవృత్తులు నిర్వీర్యమయ్యాయని, ఏ కులం వాళ్లు కూడా ఆత్మగౌరవంతో బతకడం లేదని రేవంత్ ఆరోపించారు. మత్స్యకార సంఘాల చేప పిల్లలు పనికి రావని.. ఆ పనిని ఆంధ్రా కాంట్రాక్టర్లకు అప్పగిస్తోందని, నాసిరకం చేప పిల్లల్ని పంపిణీ చేసి కొందరు సర్కారు పెద్దలు మత్స్యకారులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా సోమవారం గాంధీభవన్​లో ఏర్పాటు చేసిన మీటింగ్​లో ఆయన మాట్లాడారు. చేప పిల్లల పంపిణీలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు. రైతులకు అందించినట్లే మత్స్యకారులకు కూడా రూ.5 లక్షల బీమా పథకాన్ని అమలు చేయాలన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం మత్స్యకారులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక మత్స్యకారులను బీసీ డీ నుంచి బీసీ ఏ గ్రూపులో చేర్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.