డ్రగ్స్ రవాణా చేస్తోందని పిల్లిని జైల్‌లో వేసిన అధికారులు.. తప్పించుకున్న మార్జాలం

డ్రగ్స్ రవాణా చేస్తోందని పిల్లిని జైల్‌లో వేసిన అధికారులు.. తప్పించుకున్న మార్జాలం

కొలంబో: శ్రీలంకలోని హై సెక్యూరిటీ ఉన్న వెలికాడ జైలులో డ్రగ్స్‌, సిమ్‌ కార్డులను అక్రమంగా రవాణా చేస్తోందని ఓ పిల్లిని అధికారులు జైలులో వేశారు. పిల్లి మెడకు డ్రగ్స్, సిమ్స్ ఉన్న చిన్న బ్యాగు ఉండటాన్ని గమనించిన జైలు ఇంటెలిజెన్స్ అధికారులు శనివారం దానిని పట్టుకొని ఓ గదిలో బంధించారు. ఆ పిల్లి మెడకు కట్టి ఉన్న చిన్న ప్లాస్టిక్ బ్యాగ్‌లో 2 గ్రాముల హెరాయిన్, రెండు సిమ్‌ కార్డులతోపాటు ఒక మెమొరీ చిప్‌ దొరికాయని వెలికాడ జైలు పోలీసు అధికారి తెలిపారు. అయితే ఆ పిల్లి ఆదివారం జైలులో నుంచి తప్పించుకొందని అరుణ అనే న్యూస్ పేపర్ వెల్లడించింది. ఈ విషయంపై జైలు అధికారులు ఇంకా స్పందించలేదు. గత కొన్ని వారాల్లో జైలు గోడలపై నుంచి కొందరు డ్రగ్స్ ఉన్న చిన్న ప్యాకెట్‌లు, సెల్‌ ఫోన్‌లు, ఫోన్ చార్జర్‌‌లను విసిరేస్తున్నారని జైలు అఫీషియల్స్ చెప్పారు. ఈమధ్య శ్రీలంక డ్రగ్ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటోందని సమాచారం.