24 రోజులుగా వెతుకుతున్నారు : పిల్లి కోసం ఆ దంపతుల బాధ వర్ణనాతీతం

24 రోజులుగా వెతుకుతున్నారు : పిల్లి కోసం ఆ దంపతుల బాధ వర్ణనాతీతం

పెంపుడు జంతువులను పెంచుకోవడం కామన్. కానీ ఓ దంపతులు పిల్లిని సొంత బిడ్డలాగా చూసుకుంటున్నారు.  గుజరాత్ రాష్ట్రము లోని సూరత్ కు చెందిన బట్టల వ్యాపారి  జెయిష్ భాయ్, అయన భార్య మీనాకు వివాహమై 17 సంవత్సరాలు గడుస్తున్నా  పిల్లలు లేరు. దీంతో గత సంవత్సరం ఒక పిల్లిని తెచ్చుకొని దానికి బాబు అని పేరుపెట్టారు. ముద్దుగా చూసుకుంటూ తమకు పిల్లలు లేరనే విషయాన్నీ మరచిపోయి సొంత బిడ్డలాగా చూసుకుంటున్నారు. ఈలోగా ఒక సారి తిరుమల దర్శనం చేసుకొని తమ మొక్కులు తీర్చుకోవాలని పిల్లి బాబుతో కలసి గత నెల 9న తిరుమలకు వెళ్లారు.

రెండు రోజులు అక్కడే బసచేసి తిరిగి 13న సూరత్ బయలుదేరేందుకు రేణిగుంట రైల్వే స్టేషన్ చేరుకొన్నారు. ట్రైన్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తి తమ పిల్లిని ఎత్తుకొని వెళ్లడంతో రైల్వేస్టేషన్ మొత్తం  వెతకటం  ప్రారంభించారు. కానీ ఎంత ప్రయత్నించినా పిల్లి దొరకక పోవడంతో.. ఎవరైనా సహాయం చేసి తమ బిడ్డ పిల్లిని వెతికి పెట్టాలని కనిపించిన ప్రతి ఒక్కరిని వేడుకున్నారు. పిల్లికోసం వారు పడే బాధను చూసి కొందరు జాలిపడ్డారు.

మరికొందరు ఆకతాయిలు ఇదే అదనుగా వారితో మీ పిల్లిని వెతికిపెడతాం అని చెప్పి వారి నుండి యాభై వేల రూపాయలను దండుకొని వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న కొందరు స్థానిక టాక్సీ డ్రైవర్లు వారికి తోడుగా వచ్చి రైల్వే పోలీసులకి విషయం తెలిపారు. అయితే రైల్వే పోలీసులకు పిల్లి కోసం ఏకేసు పెట్టాలో అర్థంగాక కంప్లైంట్ తీసుకోకుండా సొంతూరు వెళ్లిపోమని సూచించారు. దీంతో ఏమిచేయాలో తెలియక ఆ దంపతులిద్దరూ 24 రోజులుగా రాష్ట్రము కానీ రాష్ట్రములో భాష రాణి చోట  దిక్కుతోచని స్థితిలో  పిల్లి కోసం వెతుకుతున్నారు. పిల్లితో సహా తీయిన్చుకున్న ఫోటోను చేతిలో పెట్టుకొని కట్టుబట్టలతో రేణిగుంటలో ప్రతివీధి తిరుగుతూ తమ బిడ్డ పిల్లి బాబు కనపడిందా అంటూ కనపడిన వారిని ప్రాధేయపడుతున్నారు. వీరిని చూసిన ప్రతి ఒక్కరూ అయ్యో పాపం పిల్లి దొరకాలని కోరుకుంటున్నారు.