మహారాష్ట్రలో కూలుతున్న హోర్డింగ్స్.. జనం ప్రాణాలతో చెలగాటం

మహారాష్ట్రలో కూలుతున్న హోర్డింగ్స్.. జనం ప్రాణాలతో చెలగాటం

కొన్ని రోజులుగా మహారాష్ట్రలో ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులు, పిడుగుల వల్ల ప్రజలు అనుకోని ప్రమాదాల బారినపడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీ ఈదురుగాలులతో కూడిన వర్షానికి థానే జిల్లాలో ఓ హోర్డింగ్‌ కూలింది. ఈ ఘటనలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. కల్యాణ్‌ ప్రాంతంలో శుక్రవారం ఉదయం 10:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కళ్యాణ్ ప్రాంతంలో అత్యంత రద్దీగా ఉండే సహజానంద్‌ చౌక్‌ వద్ద ఏర్పాటు చేసిన హోర్డింగ్‌ ఒక్కసారిగా కూలి వాహనాలపై పడింది. 

ఈ ఘటనలో మూడు వాహనాలు పూర్తిగా ధ్వంసమైనట్లు  తహసీల్దార్ సచిన్ షెజల్ తెలిపారు. హోర్డింగ్‌ కూలిన సమయంలో అక్కడ కొందరు వ్యక్తులు కూడా ఉన్నారని.. కానీ తృటిలో వారు ప్రమాదం నుంచి తప్పించుకున్నారని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

 

 

మహారాష్ట్రలో హోర్డింగ్ లు కుప్ప కూలడం ఇదేం కొత్త కాదు. గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలే జరిగాయి.   భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా మే 13న ఘాట్‌కోపర్ ప్రాంతంలో హోర్డింగ్ కూలిపోవడంతో 17 మంది మరణించగా 64 మంది గాయపడ్డారు.