కేజ్ ​కల్చర్ ​మత్స్యకారుల ఆవేదన

 కేజ్ ​కల్చర్ ​మత్స్యకారుల ఆవేదన

మందమర్రి, వెలుగు: ‘కేజ్​కల్చర్’  ద్వారా ఉపాధి పొందుతున్న మత్స్యకారులను గోదావరి వరద నిండా ముంచింది. ఉమ్మడి జిల్లాలోని ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టులకు వరద పోటెత్తడంతో  కేజ్​కల్చర్​ యూనిట్లు కొట్టుకుపోయాయి. ఫలితంగా130 టన్నుల   చేపలు గోదావరి పాలయ్యాయి. కేజ్​ కల్చర్​ నిర్వాహకులు దాదాపు రూ.5 కోట్ల వరకు నష్టపోయారు. నెల రోజులుగా  రిజర్వాయర్లలో చేపల వేట లేక వందలాది మత్స్యకారులు, కేజ్​ కల్చర్ నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు.  ప్రభుత్వం ఆదుకోవాలని15 రోజులుగా మంత్రులు, సంబంధిత శాఖ ఆఫీసర్లు చుట్టూ తిరుగుతున్నారు. నాలుగేళ్ల కింద ఏర్పాటు జిల్లాలో చేపలు వృద్ధిని పెంచేందుకు మత్స్యశాఖ ఆధ్వర్యంలో 2018లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎల్లంపల్లి, కడెం రిజర్వాయర్లలో 8 మందిని కలిపి ఒక గ్రూప్​ చొప్పున 20  గ్రూపులు ఏర్పాటు చేశారు. ఆఫీసర్లు సూచనలు, సలహాలు, శిక్షణ మేరకు కేజ్​ కల్చర్​ నిర్వాహకులు, మత్స్యకారులు  చేపల పెంపకం చేపట్టారు. 

రోడ్డున పడేసిన వరద..

ఎల్లంపల్లి రిజర్వాయర్​లో..  ఏర్పాటు చేసిన కేజ్ కల్చర్​ యూనిట్ల ద్వారా రెండుసార్లు పాక్షికంగా చేపల పెంపకం  చేపట్టారు. ఈ సారి ఆఫీసర్ల సలహాలు, సూచనలతో పూర్తిస్థాయిలో చేపలు ఉత్పత్తి చేసే ఛాన్స్ వచ్చింది.  మరో నెల రోజుల్లో తమ యూనిట్లలో ఎదిగిన చేపలను మార్కెట్​లో అమ్ముకోవచ్చనుకున్న దశలో వరదలు నిండా ముంచాయి.  చేపలతో పాటు  నాలుగు మోటారు బోట్లు, సుమారు పది టన్నుల నిల్వ  చేసిన దాణాఫ్లోటింగ్ హౌజ్ (నీటిపై తేలియాడే ఇల్లు), వలలు, లైవ్​ జాకెట్లు ఇతర సామగ్రి పూర్తిగా వరదలో కొట్టుకుపోయాయి.  

పరిహారం  ఎప్పుడిస్తరో..

 రూ.4 కోట్ల వరకు  నష్టం జరగడంతో రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని మత్స్యకారులు  వేడుకుంటున్నారు.15 రోజులుగా మంత్రులు, ఆఫీసర్లను కలిసి తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. కేజ్ కల్చర్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి తాము చేసిన అప్పులు కూడా ఇంకా తీరలేదని, ఆధునిక పద్ధతుల్లో చేపలను పెంచే ప్రక్రియను ఎంతో సాహసంతో ప్రయోగాత్మకంగా చేపట్టిన తమను ఆదుకోవడం ద్వారా భవిష్యత్ లో ఔత్సాహిక మత్స్యకారుల్లో విశ్వాసాన్ని కలిగించాలని కోరుతున్నారు. ఇప్పటికే   రాష్ట్ర మంత్రులు హరీశ్​​రావు, తలసాని శ్రీనివాస్​యాదవ్​, తదితరులను కలిసి  విన్నవించుకున్నారు.

నోటికాడి బుక్క నీళ్లపాలు..

అప్పులు చేసి  మరీ..చేపల పెంపకం కోసం కేజ్​ కల్చర్​ యూనిట్లు ఏర్పాటు చేశాం. రిజర్వాయర్​లో పూర్తిస్థాయి నీళ్లులేక రెండు సార్లు చేపల ఉత్పత్తి జరుగలేదు. ఈసారి చేపలు పెరగడంతో లాభాలు వస్తాయని, అప్పులు తీరుతాయని ఆశపడ్డాం.  వరద నోటికాడి బుక్క ఎత్తుకెళ్లింది.  ప్రభుత్వం ఆదుకోవాలి.

- పిట్టం తిరుపతి, కేజ్​ కల్చర్​ యూనిట్​ నిర్వాహకుడు

నోటికాడి బుక్క నీళ్లపాలు..

అప్పులు చేసి  మరీ..చేపల పెంపకం కోసం కేజ్​ కల్చర్​ యూనిట్లు ఏర్పాటు చేశాం. రిజర్వాయర్​లో పూర్తిస్థాయి నీళ్లులేక రెండు సార్లు చేపల ఉత్పత్తి జరుగలేదు. ఈసారి చేపలు పెరగడంతో లాభాలు వస్తాయని, అప్పులు తీరుతాయని ఆశపడ్డాం.  వరద నోటికాడి బుక్క ఎత్తుకెళ్లింది.  ప్రభుత్వం ఆదుకోవాలి.

- పిట్టం తిరుపతి, కేజ్​ కల్చర్​ యూనిట్​ నిర్వాహకుడు