దుబాయ్‌‌లో భార్య హత్య.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో నిందితుడి అరెస్టు

దుబాయ్‌‌లో భార్య హత్య.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో నిందితుడి అరెస్టు
  •     12 ఏండ్ల తర్వాత అదుపులోకి తీసుకున్న సీబీఐ

హైదరాబాద్‌‌, వెలుగు:  దుబాయ్‌‌లో తన భార్యను హత్య చేసి 12 ఏండ్లుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడు సత్తార్ ఖాన్‌‌ (52) ను సీబీఐ అధికారులు సోమవారం అరెస్టు చేశారు. నిందితుడు దోహాకు పారిపోతుండగా శంషాబాద్‌‌ ఎయిర్‌‌‌‌పోర్టులో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని నాంపల్లిలోని సీబీఐ స్పెషల్‌‌  కోర్టులో హాజరుపరిచారు. ట్రాన్సిట్  వారంట్‌‌పై దుబాయ్‌‌కి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

హైదరాబాద్‌‌కు చెందిన సత్తార్  ఖాన్‌‌  దుబాయ్‌‌లో కారు డ్రైవర్‌‌‌‌గా పనిచేసేవాడు. దుబాయ్‌‌లో ఉన్నపుడు 2013 నవంబర్‌‌‌‌ 14న తన భార్యను హత్య చేశాడు. తర్వాత ఇండియాకు పారిపోయి వచ్చాడు. ఈ మేరకు యూఏఈలో అతనిపై హత్య కేసు నమోదైంది. నాటి నుంచి నిందితుడు తప్పించుకు తిరుగుతున్నాడు. యూఏఈ అధికారుల అభ్యర్థన మేరకు 2022 ఏప్రిల్‌‌లో ప్రాసిక్యూషన్ కేసు నమోదు చేసింది. పాస్‌‌పోర్టు ఆధారంగా లుకౌట్‌‌  నోటీసు జారీ చేశారు. 

మరోవైపు నిందితుడు హైదరాబాద్  నుంచి మకాం మార్చేందుకు పథకం రచించాడు. దోహాకు పారిపోవడానికి ప్రయత్నించాడు. సోమవారం శంషాబాద్‌‌  ఎయిర్‌‌‌‌పోర్టుకు వెళ్లాడు. లుకౌట్‌‌  నోటీసు ఉండడంతో ఇమిగ్రేషన్  అందించిన సమాచారంతో సత్తార్‌‌‌‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.