ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అనిల్ అంబానీపై సెంట్రల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ సీబీఐ తాజాగా కేసు నమోదు చేసింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్‌తో కలిసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.228 కోట్ల మేర ఆర్థిక నష్టం కలిగించారనే ఆరోపణలవిషయంలో కేసు నమోదైంది. ప్రభుత్వ రంగ బ్యాంక్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు.
యూనియన్ బ్యాంక్ దాఖలు చేసిన ఫిర్యాదులో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్, దాని అప్పటి డైరెక్టర్లు జై అన్మోల్ అంబానీ, రవీంద్ర శరద్ సుధాకర్ పేర్లను కేసులో చేర్చబడ్డాయి. ఈ ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో కంపెనీ బోర్డులో ఉన్నట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. అందుకే ప్రస్తుతం వారిపై కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది.
ALSO READ : ఉద్యోగుల కోసం రూ.294 కోట్లతో 200 రెడీ ఫ్లాట్స్ కొనుగోలు..
రిలయన్స్ హోమ్ ఫైనాన్స్(RHFL) వ్యాపార కార్యకలాపాల కోసం ముంబైలోని స్పెషలైజ్డ్ ఎస్‌సీఎఫ్ బ్రాంచ్ నుండి రూ.450 కోట్ల క్రెడిట్ ఫెసిలిటీ పొందింది. ఈ రుణం మంజూరులో భాగంగా కంపెనీ సకాలంలో వాయిదాలు, వడ్డీ చెల్లింపులు, భద్రత, ఇతర నిబంధనలను పాటించడంలో కఠినమైన ఆర్థిక క్రమశిక్షణను పాటించాల్సి ఉంది. అయితే RHFL కంపెనీ మాత్రం బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమైందని, ఫలితంగా సెప్టెంబర్ 30, 2019న ఈ లోన్ అకౌంట్ నిరర్థక ఆస్తి(NPA)గా బ్యాంక్ వర్గీకరించింది. నిబంధనలు గుర్తుచేసినా, పర్యవేక్షణ చేసినా కంపెనీ పదేపదే డిఫాల్ట్ అయిందని అధికారులు చెప్పారు.
ఫోరెన్సిక్ ఆడిట్‌లో తేలిన విషయాలు:
ఏప్రిల్ 2016 నుండి జూన్ 2019 మధ్య కాలానికి సంబంధించిన గ్రాంట్ థార్న్టన్ నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో ముఖ్యమైన అవకతవకలు బయటపడ్డాయి. తీసుకున్న నిధులను అధికారం లేని వ్యాపార ప్రయోజనాల కోసం మళ్లించి దుర్వినియోగం చేశారని ఆడిట్ గుర్తించింది. అప్పటి ప్రమోటర్లు, డైరెక్టర్లు ఉద్దేశించిన ఆర్థిక కార్యకలాపాల నుంచి డబ్బును పక్కదారి పట్టించారని బ్యాంక్ తన ఫిర్యాదులో పేర్కొంది. అనుబంధ సంస్థల ద్వారా ఈ నిధుల మళ్లింపు జరిగిందని గుర్తించబడింది. అయితే ఈ ఆరోపణలపై రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. సీబీఐ తన దర్యాప్తులో భాగంగా త్వరలో సంబంధిత వ్యక్తులను ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది.

